ప్రతి రోజూ దాదాపు యాభై నుంచి వంద వరకు వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇది చాలా సహజం. అయితే ఇంతకంటే ఎక్కువ మొత్తంలో వెంట్రుకలు రాలిపోతుంటే మాత్రం, అది బట్టతలకు దారితీయొచ్చు. జుట్టు రాలిపోవడం మొదలవ్వగానే చాలా మంది షాంపూలు, హెయిర్ మాస్కులు వాడటం చేస్తుంటారు.
సీరమ్స్, ఇతర మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే వీటితోపాటు చేయాల్సిన ముఖ్యమైన పని ఇంకోటుంది. అదే ఆహారంలో ఐరన్ తీసుకోవడం. రోజూ తగినంత ఐరన్ అందకుంటే జుట్టు రాలిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన అంశాలు, చర్మ సమస్యలు, మానసిక ఇబ్బందులు, కాలు ష్యంతోపాటు ఐరన్ లోపం కూడా వెంట్రుకలు రాలేందుకు ప్రధాన కారణమవుతోందని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే ఆహారంలో రోజూ తప్పనిసరిగా ఐరన్ శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
సాధారణంగా మాంసాహారంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శాకాహారంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి శాకాహారులు ఐరన్ అధికంగా ఉండే పదార్థాల్ని అధికంగా తీసుకో వాలి. మహిళలకైతే రోజూ 18 మిల్లీ గ్రాములు, పురుషులైతే ఎనిమిది మిల్లీ గ్రాముల ఐరన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిక్కుళ్లు. పొద్దు తిరుగుడు గింజలు, పాలు, పాల పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ లలో ఐరన్ అధికంగా ఉంటుంది..
