ఢిల్లీలో ..పెట్రోల్, డీజిల్ ఫోర్- వీలర్లపై బ్యాన్

ఢిల్లీలో ..పెట్రోల్, డీజిల్ ఫోర్- వీలర్లపై బ్యాన్

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 419 కి చేరింది. ఈ నేపథ్యంలో అధ్వాన్నమైన గాలి నాణ్యత దృష్ట్యా ఈరోజు నుంచి ఢిల్లీలో BS-III పెట్రోల్, BS-IV డీజిల్ ఫోర్- వీలర్లపై అక్కడి ప్రభుత్వం తాత్కాలిక నిషేధం ప్రకటించింది. ఇది శుక్రవారం వరకు వర్తిస్తుందని తెలిపింది. ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే.. మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. "ఏదైనా BS-III, పెట్రోల్, BS-IV, డీజిల్ LMV (4-వీలర్) రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించినట్లయితే, మోటారు వాహనాల చట్టం, 1988 సెక్షన్ 194(1) ప్రకారం రూ. 20,000 జరిమానా విధించబడుతుంది" అంటూ ఆదేశాలు జారీ చేశారు. 

ప్రస్తుతం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల కనిష్టానికి పడిపోవడం, పొగమంచు పెరగడంతో గాలి నాణ్యతలో విపరీతమైన తేడా కనిపిస్తోంది. కాలుష్య నిరోధక నియంత్రణలను అమలు చేయాలని, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ - CAQM కేంద్రానికి కీలక సూచనలు చేసింది. ఇప్పటికే చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టకుండా చర్యలు తీసుకునేలా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాంతో పాటు గత రెండు రోజులుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.