అరెస్ట్లు, నిర్బంధాల్లోనూ దేశంలోనే ఫస్ట్
2022లో అత్యధికంగా రాష్ట్రంలో
40 మంది జర్నలిస్టుల అరెస్టు
తర్వాతి స్థానాల్లో యూపీ (6), జమ్మూకాశ్మీర్ (4), మధ్యప్రదేశ్ (3)
రైట్స్ అండ్ రిస్క్స్ అనలైసిస్ గ్రూప్ (ఆర్ఆర్ఏజీ) సంస్థ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోయిన ఏడాది ప్రభుత్వ ప్రోద్బలంతో జర్నలిస్టులను అరెస్ట్ చేసి లేదా అదుపులోకి తీసుకుని వేధించిన ఘటనలు తెలంగాణలోనే అత్యధికంగా జరిగాయని ఢిల్లీకి చెందిన రైట్స్ అండ్ రిస్క్స్ అనాలసిస్ గ్రూప్ (ఆర్ఆర్ఏజీ) అనే మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. నిరుడు దేశవ్యాప్తంగా పోలీసులు70 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేయడం లేదా అదుపులోకి తీసుకోవడం చేయగా.. వీరిలో తెలంగాణలోనే అత్యధికంగా 40 మంది జర్నలిస్టులు ఉన్నారని తెలిపింది.
దేశవ్యాప్తంగా 2022 ఏడాదిలో మొత్తం 194 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయని, 8 మంది హత్యకు గురయ్యారని ఆర్ఆర్ఏజీ వెల్లడించింది. దాడులకు గురైనవారిలో ఏడుగురు మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించినందుకు, ఇతర కారణాలతో వీరిని ప్రభుత్వ అధికారులు, పోలీసులు, పొలిటీషియన్స్, క్రిమినల్స్ టార్గెట్ చేశారని రిపోర్ట్ లో పేర్కొంది. దేశంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యక్తుల చేతుల్లో కలిపి అత్యధికంగా జమ్మూకాశ్మీర్ లో 48 మందిపై అటాక్స్ జరిగాయని తెలిపింది. ఆ తర్వాత తెలంగాణలో అత్యధికంగా 40 మంది దాడులకు గురయ్యారని పేర్కొంది. అయితే.. వీరందరినీ ప్రభుత్వం, పోలీసులే టార్గెట్ చేశారని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతమందిని టార్గెట్ చేయలేదని ఆ సంస్థ తన రిపోర్ట్ లో వివరించింది.
103 మందిపై ‘సర్కార్’ టార్గెట్
దేశంలో నిరుడు మొత్తం103 మంది జర్నలిస్టులను ప్రభుత్వ పెద్దలు, అధికారులు, పోలీసులు కలిసి టార్గెట్ చేశారని, వీరిలో 70 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారు లేదా అదుపులోకి తీసుకున్నారని ఆర్ఆర్ఏజీ డైరెక్టర్ సుహాస్ చక్మా వెల్లడించారు. ‘‘14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై దేశద్రోహం (సెక్షన్ 124ఏ), పరువునష్టం (సెక్షన్ 500), మతపరంగా అల్లర్లకు రెచ్చగొట్టడం (సెక్షన్ 295ఏ), వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం (సెక్షన్ 153ఏ), ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల (66సీ, 67, 69) కింద, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అభియోగాలు మోపారు”అని తెలిపారు.15 మంది జర్నలిస్టులపై పోలీసులు ఫిజికల్ గా దాడులు చేయడం, బెదిరించడం, వేధించడం వంటివి చేశారన్నారు. మిగిలిన 91 మందిని ప్రభుత్వేతర వ్యక్తులు, రాజకీయ నాయకులు, క్రిమినల్స్ టార్గెట్ చేశారని పేర్కొన్నారు.
ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ
ఏ రాష్ట్రంలో ఏ జర్నలిస్టుపై ఎవరు దాడి చేశారన్న వివరాలతో కూడిన జాబితాను కూడా ఆర్ఆర్ఏజీ రిపోర్ట్ లో పొందుపర్చింది. సంస్థ వెబ్ సైట్ లో ఆయా రాష్ట్రాల్లో జరిగిన దాడులకు సంబంధించిన మీడియా కథనాల లింక్ లను కూడా రిపోర్ట్ కు జోడించింది. 2022లో తెలంగాణలో 40 మంది జర్నలిస్టులు, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని, వేధించారని సంబంధిత మీడియా కథనాల లింక్ లనూ పొందుపర్చింది. ఇక ప్రభుత్వం, పోలీసులు కాకుండా ఇతరుల చేతిలో 91 మంది జర్నలిస్టులు దాడులకు గురయ్యారని, వీటిలో ఎక్కువ ఘటనలు ఒడిశా (5), యూపీ(5)లో జరిగాయని పేర్కొంది. హత్యకు గురైన 8 మంది జర్నలిస్టుల్లో ఏడుగురు ప్రభుత్వేతర రాజకీయ నాయకులు, క్రిమినల్స్ చేతుల్లో చనిపోయారని ఆర్ఆర్ఏజీ వెల్లడించింది. పోయిన ఏడాది దేశంలో పత్రికా స్వేచ్ఛ పెద్దగా మెరుగుపడలేదని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. ప్రభుత్వం, ప్రభుత్వేతర వ్యక్తుల చేతిలో జర్నలిస్టులు దాడులకు గురయ్యే ప్రమాదం మరింత పెరిగిందని, ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారని సుహాస్ చక్మా అభిప్రాయపడ్డారు.
