న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల బాంబు పేలుడు నేపథ్యంలో హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులైన డాక్టర్లు ఇదే యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తుండటంతో ఆ వర్సిటీపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్సిటీకి వస్తున్న ఫండింగ్, వర్సిటీ బ్యాంకు ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు ఈడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీ ఓఖ్లాలోని వర్సిటీ ఆఫీస్‌తోపాటు హర్యానా ఫరీదాబాద్ లోని వర్సిటీ క్యాంపస్‌లో, వర్సిటీ చైర్మన్ ఇంటితోపాటు మొత్తం 25 చోట్ల సోదాలు నిర్వహించింది.
ఇదే అంశంపై ఢిల్లీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం కూడా రంగంలోకి దిగింది. ఈ నెల 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడులో 13 మంది మరణించారు. ఈ ఘటన వెనక అల్ ఫలాహ్ వర్సిటీకి చెందిన డాక్టర్లు ఉన్నట్టు గుర్తించిన ఎన్ఐఏ
పలువురిని అరెస్ట్ చేసి, విచారిస్తోంది.
