అమిత్​షాకు మోదీ రూట్​క్లియర్ చేస్తున్నరు: కేజ్రీవాల్​

అమిత్​షాకు మోదీ రూట్​క్లియర్ చేస్తున్నరు: కేజ్రీవాల్​

న్యూఢిల్లీ: బీజేపీలో వారసత్వ యుద్ధం జరుగుతోందని ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ అన్నారు. ప్రధాని మోదీ తన వారసుడిగా అమిత్ షాకు మార్గం సుగమం చేస్తున్నారని తెలిపారు. అందుకోసమే పెద్ద నాయకులందరినీ తొలగించారని ఆరోపించారు. శుక్రవారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పార్టీలో 75 ఏండ్లు పైబడినవారందరినీ రిటైర్​ చేస్తున్నామని, ఇందులో రాజీపడేది లేదని 2019లో అమిత్​షా ప్రకటించారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. 

75 ఏండ్లు దాటిన వారికి పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు” అని తెలిపారు. ఈ నిబంధన ప్రకారం.. అద్వానీ, ​ జోషి, సుమిత్రా మహాజన్ ​రిటైర్​ అయ్యారని చెప్పారు. ఇదే తరహాలో శివరాజ్​సింగ్​ చౌహాన్​, వసుంధర రాజే, మనోహర్​లాల్​ ఖట్టర్​, రమణ్​ సింగ్​ ఇలా ఒక్కొక్కరినీ మోదీ పక్కనబెడుతున్నారని తెలిపారు. ఇప్పుడు యూపీ సీఎం యోగీని కూడా ఇలాగే పక్కన బెడతారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని కేజ్రీవాల్ తెలిపారు. ఇదంతా అమిత్​షాకు లైన్​క్లియర్​చేసేందుకేనని కేజ్రీవాల్​ఆరోపించారు.