లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పులు

లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పులు

ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో కాల్పులు జరిగినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కొంతమంది లాయర్ల మధ్య జరిగిన వాగ్వాదం ఈ ఘటనకు దారితీసినట్లు తెలుస్తోంది. పరిస్థితి దిగజారకముందే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలలో, ఒక న్యాయవాది చేతిలో తుపాకీని పట్టుకుని గాలిలోకి గురిపెట్టడం చూడవచ్చు. ఈ సమయంలో చుట్టుపక్కల ఉన్న ఇతర న్యాయవాదులు దుర్భాషలాడటం కూడా వినవచ్చు. కోర్టు ఆవరణలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం లాగా కనిపించే విధంగా ఎదురుగా రాళ్ళు విసరడం కూడా ఇక్కడ కనిపిస్తుంది. వెంటనే చేతిలో తుపాకీతో ఉన్న న్యాయవాది గాలిలోకి కాల్పులు జరుపుతుండగా ఇతరులు దుర్భాషలాడడం మొదలుపెట్టారు.

తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో కాల్పుల ఘటనను ఖండించిన ఢిల్లీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ కెకె మనన్.. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. "ఈ విషయంపై విచారణ చేపడతాం. ఆయుధాలకు లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా విచారిస్తాం. ఆయుధాలకు లైసెన్స్ ఉన్నప్పటికీ, ఏ న్యాయవాది లేదా మరెవరూ వాటిని కోర్టు ప్రాంగణం చుట్టూ లేదా లోపల ఉపయోగించలేరు" అని ఆయన తెలిపారు.

కాల్పుల ఘటన వార్త తెలిసిన కొద్దిసేపటికే, ఢిల్లీ పోలీసులు ఘటనకు సంబంధించిన సమాచారంపై ఓ   ప్రకటనను పంచుకున్నారు. "ఈరోజు PS సబ్జీ మండి వద్ద ఒంటి గంట 30నిమిషాల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, కార్యాలయ సిబ్బందితో సహా ఇద్దరు వేర్వేరు న్యాయవాదులు గాలిలో కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. చట్టపరమైన చర్యలు చేపడుతున్నాం" అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

https://twitter.com/ANI/status/1676508841272553472