పాత వాహనాలకు ఫ్యూయల్ బ్యాన్పై ఢిల్లీ సర్కార్ యూటర్న్

పాత వాహనాలకు ఫ్యూయల్ బ్యాన్పై ఢిల్లీ సర్కార్ యూటర్న్
  • వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉత్తర్వులు వెనక్కి

న్యూఢిల్లీ: పాత వాహనాలకు ఫ్యూయల్​నిషేధంపై ఢిల్లీ సర్కార్​యూ-టర్న్ తీసుకుంది. కాలంచెల్లిన వెహికల్స్​కు ఈ నెల 1వ తేదీ నుంచి బంకుల్లో పెట్రోల్, డీజిల్ నింపొద్దని జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసింది. 15 ఏండ్లు నిండిన వాహనాలకు  ఫ్యూయల్​ బ్యాన్ చేయడంపై వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సోషల్​ మీడియా వేదికగా జనం స్పందించిన తీరుతో ఢిల్లీ ప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చింది. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు గురువారం ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వును ప్రస్తుతానికి నిలిపివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌‌‌‌మెంట్ కమిషన్ కు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ లేఖ రాశారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. ఫ్యూయల్​ బ్యాన్​ను అమలు చేయడంలో టెక్నికల్​ సమస్యలు వచ్చాయని చెప్పారు. ఢిల్లీలోని 498 బంకుల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు కాలం చెల్లిన వాహనాలను, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను సరిగా గుర్తించలేకపోతున్నాయన్నారు.

అందుకే పాత వాహనాలకు ఫ్యూయల్​ నింపొద్దన్న ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. ఇకపై బాగా మెయింటెన్​ చేయని, పొగొచ్చే వాహనాలను గుర్తించేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం బాగా మెయింటెన్ చేసే వెహికల్స్, కాలుష్య కారకం కానీ వాహనాలపై ప్రభావం పడుతున్నదని గ్రహించినట్టు చెప్పారు. 15 ఏండ్లకు మించిన పెట్రోల్ వెహికల్స్​ను, పదేండ్లు నిండిన డీజిల్ వాహనాలను ‘ఎండ్ ఆఫ్ లైఫ్’ వాహనాలుగా  పేర్కొంటూ బంకుల్లో ఫ్యూయల్​ నింపొద్దని ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ .. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది.