న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద భార్య లేదా భర్త ఆదాయ వివరాలను అధికారుల నుంచి పొందలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భరణం కేసు విచారణ కోసం భర్త ఆదాయ వివరాలు అవసరమన్న ఓ మహిళ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ తీర్పును వెలువరిస్తూ ఒక వ్యక్తి ఆదాయపు పన్ను వివరాలు వారి వ్యక్తిగత సమాచారం కిందికి వస్తాయని గుర్తుచేశారు.
ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జే) ప్రకారం ప్రజాప్రయోజనాలతో సంబంధం లేని ఏ వ్యక్తిగత సమాచారాన్ని అధికారులు బహిర్గతం చేయకూడదని కోర్టు తెలిపింది. ఈ కేసులో భర్త ఆదాయం భార్యకు వ్యక్తిగతంగా అవసరమే కావచ్చు కానీ, అది "బృహత్తర ప్రజాప్రయోజనం" కిందికి రాదని కోర్టు పేర్కొంది. 2007–08 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భర్త నికర ఆదాయ వివరాలను వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది.
ఆ ఉత్తర్వులు చట్టబద్ధంగా నిలబడవని అభిప్రాయపడింది. భరణం కేసుల విచారణకు భర్త ఆదాయ వివరాలు అవసరమన్న మహిళ వాదనను కోర్టు తోసిపుచ్చింది. దీని కోసం ఇతర చట్టపరమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. భరణం క్లెయిమ్ చేసేటప్పుడు ఇరుపక్షాలు తమ ఆదాయం, ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్లను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుందని, దాని ద్వారా న్యాయం పొందవచ్చని సూచించింది.
