లాయర్స్ Vs పోలీసుల కొట్లాట: ఆదివారమైనా హైకోర్టు విచారణ

లాయర్స్ Vs పోలీసుల కొట్లాట: ఆదివారమైనా హైకోర్టు విచారణ

ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు దగ్గర శనివారం లాయర్లు, పోలీసులు మధ్య జరిగిన కొట్లాటపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆదివారం అయినప్పటికీ దీనిపై ప్రత్యేకంగా వాదనలు విన్నారు సీజే జస్టిస్ డీఎన్ పటేల్. ఈ ఘటనపై జుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని, ఈ ఎంక్వైరీపై  ఢిల్లీ హైకోర్టు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

పార్కింగ్ దగ్గర గొడవ

శనివారం తీస్ హజారీ కోర్టు దగ్గర పార్కింగ్ సమయంలో లాయర్, పోలీసు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో గొడవ మొదలైంది. ఇద్దరు మనుషుల మధ్య గొడవ కాస్తా లాయర్లు, పోలీసుల కొట్లాటగా మారింది. ఇరు వర్గాలు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. లాయర్లు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు ఒక దశలో లాఠీ చార్జ్ చేశారు. కాల్పుల వరకు వెళ్లింది. ఈ మొత్తం రచ్చలో 20 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు లాయర్లకు తీవ్రంగా గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

రిటైర్డ్ జడ్జితో జుడిషియల్ ఎంక్వైరీ

పోలీస్, లాయర్ కొట్లాటను ఆదివారం ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా పోలీసులు దీనిపై స్పెషల్ క్రైం బ్రాంచ్ టీమ్ తో దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పారు. అయితే దీనికి ఒప్పుకోని లాయర్లు జుడిషియల్ విచారణ కోరారు. రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్పీ గార్గ్ నేతృత్వంలో జుడిషియల్ కమిటీని నియమించింది.

సీబీఐ డైరెక్టర్, ఐబీ డైరెక్టర్, విజిలెన్స్ డైరెక్టర్ లేదా వారు నియమించిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని, ఎంక్వైరీ ఆరు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది కోర్టు. ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ స్పెషల్ కమిషనర్ సంజయ్ సింగ్, అడిషనల్ డీసీపీ హరీందర్ సింగ్ లను బదిలీ చేయాలని కోర్టు చెప్పింది. అలాగే దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కమిషన్ కు సూచించింది.

గాయపడిన వారికి పరిహారం

తీస్ హజారీ కోర్టు ఘటనలో గాయపడిన లాయర్ విజయ్ వర్మకు రూ.50 వేలు, మరో ఇద్దరు లాయర్లకు రూ.15 వేలు, రూ.10 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. అలాగే ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు లాయర్లకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది ఢిల్లీ బార్ కౌన్సిల్. అలాగే గాయాలైన మిగిలిన లాయర్లకు తలా 50 వేలు ఇస్తామని చెప్పింది.