నోట్లకట్టల జడ్జిపై కేసు పెట్టాలె..సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

నోట్లకట్టల జడ్జిపై కేసు పెట్టాలె..సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
  • ఈమేరకు పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి
  • 1991 తీర్పునూ సవాలు చేసిన పిల్

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్  వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టల వ్యవహారంలో కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్  దాఖలైంది. అలాగే, సుప్రీంకోర్టు చీఫ్  జస్టిస్  అనుమతి లేకుండా హైకోర్టు జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జిపై దర్యాప్తు చేపట్టకూడదని కె.వీరస్వామి కేసులో 1991లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా పిల్  సవాలు చేసింది. అడ్వొకేట్  మ్యాథ్యూస్  జె.నెడుంపారతో పాటు మరో ముగ్గురు ఈనెల 23న ఈ పిటిషన్  దాఖలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమే అని, జడ్జీలపై ఆరోపణలు వచ్చినపుడు వారిపై విచారణ చేయాలని వారు తమ పిటిషన్ లో కోరారు. 

వారిపై ఎంక్వైరీ చేయకుండా వదిలేయడమంటే చట్టం ముందు అందరూ సమానమే అన్న రాజ్యాంగ సూత్రాన్ని ఉల్లంఘించినట్లేనని తెలిపారు. జడ్జి యశ్వంత్  వర్మ కేసులో ఇప్పటి వరకూ ఎఫ్ఐఆర్  నమోదు చేయలేదని, దీనిపై పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ నెల 14న జడ్జి యశ్వంత్  వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంటలను ఆర్పేందుకు ఆయన ఇంటికి వెళ్లిన ఫైర్  సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. 

దీంతో జడ్జిని సస్పెండ్  చేస్తూ సీజేఐ సంజీవ్  ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంతో పాటు ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, నోట్ల కట్టల వ్యవహారంపై విచారణకు సీజేఐ అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. యశ్వంత్ కు ఎలాంటి జ్యుడీషియల్  పని ఇవ్వకూడదని ఢిల్లీ హైకోర్టు చీఫ్​ జస్టిస్  డీకే ఉపాధ్యాయకు సీజేఐ సూచించారు. దీంతో, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జడ్జిని డీరోస్టర్  (రోస్టర్  జాబితా నుంచి తొలగించడం) చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది.

యశ్వంత్  వర్మ బదిలీకి కొలీజియం సిఫారసు

ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్  వర్మను అలహాబాద్  హైకోర్టుకు బదిలీ చేస్తూ సీజేఐ సంజీవ్  ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం సిఫారసు చేసింది. తొలుత అలహాబాద్​కు బదిలీ చేయాలని, ఈ కేసు దర్యాఫ్తు పూర్తయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటాని పేర్కొంది.