నిప్పంటించిన భర్తను క్షమించిన భార్య...జైలు శిక్షను తగ్గించిన ఢిల్లీ హైకోర్టు

నిప్పంటించిన భర్తను క్షమించిన భార్య...జైలు శిక్షను తగ్గించిన ఢిల్లీ హైకోర్టు
  •     క్షమాగుణంలో మహిళలది పెద్ద మనసు అంటూ వ్యాఖ్య 
  •     బాధితురాలి కుటుంబీకుల కోసమే కస్టడీ కాలాన్ని సవరించిన ధర్మాసనం 

న్యూఢిల్లీ, వెలుగు: వరకట్నం కోసం గర్భిణి అయిన భార్యకు నిప్పంటించిన కేసులో దోషికి ఢిల్లీ హైకోర్టు శిక్ష తగ్గించింది. దాదాపు 25 ఏళ్ల కింద జరిగిన ఈ ఘటనలో తన భర్తను మనస్ఫూర్తిగా క్షమించానని, ప్రస్తుతం తామంతా కలిసి జీవిస్తున్నామని బాధితురాలు కోర్టుకు నివేదించింది. దీంతో మానవీయ కోణంలో స్పందించిన ధర్మాసనం, నిందితులకు విధించిన శిక్షను ఇప్పటి వరకు వారు జైలులో గడిపిన కాలానికి సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2000 నవంబర్‌‌లో న్యూఢిల్లీలోని రాజపురిలో వరకట్నం కోసం సవిత వేధింపులకు గురైంది. ఆమె గర్భిణిగా ఉండగా భర్త రాజు నిప్పంటించాడు. భర్తతోపాటు అత్త బర్ధిదేవి, బావ శంభు ఆమె కదలకుండా చేతులు పట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పుట్టింటికి పంపించగా, ఆయుర్వేద చికిత్స పొందింది. ప్రసవం అనంతరం 2001 ఏప్రిల్‌‌లో బాధితురాలు సవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ కేసులో 2004లో విచారణ చేపట్టిన దిగువ కోర్టు ముగ్గురిని దోషులుగా తేల్చి, హత్యాయత్నం కింద ఏడేళ్ల కఠిన శిక్షతో పాటు ఇతర సెక్షన్ల కింద జైలు శిక్ష విధించింది. దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా బాధితురాలు సవిత స్వయంగా కోర్టుకు హాజరై తన అఫిడవిట్‌‌ను సమర్పించారు. "మా మధ్య సమస్యలు పరిష్కారమయ్యాయి, నేను భర్తతోనే కలిసి ఉంటున్నాను. మాకు ఐదుగురు సంతానం ఉన్నారు. ఇప్పుడు వారిని జైలుకు పంపవద్దు" అని కోర్టును కోరారు. అయితే, నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష తగ్గించవద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించారు. 

ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన జస్టిస్ విమల్ కుమార్ యాదవ్ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘తీవ్రమైన కాలిన గాయాలపాలైనప్పటికీ సవిత తన భర్తను, అత్తను క్షమించడం ఆమె గొప్ప మనసును చాటుతోంది”అని కోర్టు పేర్కొంది. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు వారిని మళ్లీ జైలుకు పంపితే, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న వారి కుటుంబ సమతుల్యత దెబ్బతింటుందని, అది సవితతో పాటు ఆమె ఐదుగురు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే, వారు దోషులన్న తీర్పును సమర్థిస్తూనే, ఇప్పటి వరకు అనుభవించిన జైలు కాలాన్నే శిక్షగా పరిగణిస్తూ కేసును ముగించింది.