ఢిల్లీ లిక్కర్ స్కాం తీర్పు పై హైకోర్టు లో సవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం తీర్పు పై  హైకోర్టు లో సవాల్
  •     ట్రయల్‌ కోర్టు జడ్జిమెంట్‌పై 974 పేజీలతో సీబీఐ రివిజన్ పిటిషన్
  •     చట్ట విరుద్ధం, అహేతుకమైన తీర్పు అని పిటిషన్‌లో ప్రస్తావన
  •     ఈ నెల 9న విచారించనున్న జస్టిస్ స్వరణ కాంత శర్మ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పుపై  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ..  దాదాపు 974 పేజీలతో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. చట్ట విరుద్ధంగా, అహేతుకంగా, ప్రాథమికంగానే లోపభూయిష్టంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి తీర్పును వెలువరించారని పిటిషన్‌లో ఆరోపించింది.  

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ)పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న కోర్టు ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నదని పేర్కొన్నది. ఆ ఆదేశాలపై స్టే ఇవ్వాలని  కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితసహా 23 మందికి రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ క్లీన్ చిట్ ఇచ్చారు. 

ఈ సందర్భంగా.. సీబీఐ తీరుపై తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నాయని, వందలాది పేజీలతో చార్జ్‌షీట్ తయారు చేసినా ఒక్క సాక్షి ప్రకటనను కూడా కచ్చితంగా చేర్చలేకపోయారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ)పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తన తీర్పులో స్పష్టం చేశారు. అయితే, ఫిబ్రవరి 27న స్పెషల్ జడ్జి జితేంద్రసింగ్ ఇచ్చిన తీర్పుపై సీబీఐ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కాగా, సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్ ఈ నెల 9న జస్టిస్ స్వరణ కాంత శర్మ బెంచ్ ముందు విచారణకు రానున్నది. 

కవిత, ఇతరుల పాత్రను పరిగణనలోకి తీసుకోలే..

కేజ్రీవాల్, సిసోడియా, కవితల పాత్రను అంచనా వేయడంలో సీబీఐ స్పెషల్ కోర్టు పొరబడిందని సీబీఐ తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసింది. వీరి పాత్రలను విశ్లేషించడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని పేర్కొన్నది. మద్యం పాలసీ వెనుక ఉన్న భారీ కుట్రను మొత్తంగా చూడకుండా, విడివిడి అంశాలుగా పరిగణించడం వల్ల కేసు నీరుగారిందని ప్రస్తావించింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన బలమైన సాక్ష్యాధారాలను పక్కనబెట్టి, కేవలం ఎంపిక చేసిన అంశాల ఆధారంగానే తీర్పునిచ్చిందని ఆరోపించింది. ముఖ్యంగా మద్యం సిండికేట్ల కోసం పాలసీని ఎలా మార్చారో వివరించే సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదని వివరించింది.