బెంగాల్లో తొలి బీజేపీ సీఎం సువేందు అధికారి ! ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు.

బెంగాల్లో తొలి బీజేపీ సీఎం సువేందు అధికారి ! ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు.

వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు ఖరారైంది. 2026 మే 08వ తేదీన నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో.. సువేందు పేరును ప్రతిపాదించారు. దీంతో బెంగాల్  తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి చరిత్ర సృష్టించనున్నారు. 2026 మే 09వ తేదీన కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

కొత్తగా ఏర్పాటు కానున్న బెంగాల్ ప్రభుత్వంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండనున్నారు. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్ షా.. బెంగాల్ శాసన సభాపక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమిక్ భట్టాచార్య సీఎం  అభ్యర్థిగా సువేందు అధికారి పేరును ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలు మద్ధతు తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు సీఎంగా సువేందు పేరును ఆమోదించారు. ఆయనను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 

సీఎం రేసులో ముందు నుంచీ బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య, సువేందు అధికారి పేర్లు బలంగా వినిపిస్తూ వచ్చాయి. అయితే భట్టాచార్య స్వయంగా సువేందు అధికారి పేరును ప్రతిపాదించడంతో సస్పెన్స్ కు తెరపడింది. 

ఇక బీజేపీ కీలక నాయకురాలు, అసన్‌సోల్ దక్షిణ ఎమ్మెల్యేగా గెలిచిన  అగ్నిమిత్ర పాల్‌కు మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  

బెంగాల్ సీఎంగా సువేందు అధికారి పేరును ప్రకటించిన హోమంత్రి అమిత్ షా.. మే 9న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ బెంగాల్ లో కొలువుదీరనుందని ఈ సందర్భంగా అమిత్ షా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది విమర్శించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ నేతలు, సెలబ్రిటీలు హాజరుకానున్నారు. 

బెంగాల్ సీఎంగా ప్రమాణం చేయనున్న సువేందు అధికారి నందిగ్రాం, భబానిపూర్ అసెంబ్లీ నియోజవర్గాల నుంచి గెలుపొందారు. భబానిపూర్ లో మాజీ సీఎం మమతా బెనర్జీపై 15 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 293 సీట్లకు గానూ బీజేపీ 207 సీట్లు గెలిచింది. బీజేపీ స్టన్నింగ్ విక్టరీ తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది.