మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వత మరింత జోరు పెంచేసింది. చాలా సెలెక్టివ్ గా సినిమాలను చేస్తోంది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ క్రేజీ ఫ్యామిలీ డ్రామా ‘సతీ లీలావతి’. దేవ్ మోహన్ హీరోగా, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకుడు. ప్రమోషన్స్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఈరోజు (మే 8, 2026) థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..
కథేంటంటే..?
లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక స్టార్ డైరెక్టర్. చిన్నతనం నుంచే తల్లిదండ్రుల గొడవల వల్ల ఆమె మనసులో ఒక రకమైన పెళ్లి భయం ఏర్పడుతుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్)ని సంప్రదిస్తుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, తండ్రి (నరేశ్) సమక్షంలో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మూడేళ్లపాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో ఒక్కసారిగా భూకంపం వస్తుంది. రామ్ సేతు ఉన్నట్టుండి విడాకులు కావాలంటాడు. తను నర్స్ నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్)తో రిలేషన్‌లో ఉన్నానని, విడాకులు ఇస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. షాకైన లీలా.. భర్తకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేక, అతడిని కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది! ఆ తర్వాత ఏమైంది? భర్తను దక్కించుకోవడానికి లీలా వేసిన ప్లాన్స్ ఏంటి? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే?
విడాకులు చాలా ఈజీ అయిపోతున్న నేటి జెన్-జీ కాలంలో.. భార్యాభర్తల బంధానికి మరణంతోనే ముగింపు ఉండాలనే మంచి సందేశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఫస్టాఫ్ అంతా లీలావతి, సేతు మధ్య సాగే లవ్, పెళ్లి, క్రేజీ గొడవలతో చాలా హిలేరియస్‌గా, ఎంగేజింగ్‌గా సాగుతుంది. జాఫర్ సాదిక్ కామెడీ ట్రాక్ బాగా నవ్విస్తుంది. కానీ, ఎప్పుడైతే భర్తను లీలా ఇంట్లో బంధిస్తుందో.. అక్కడి నుంచి కథ ట్రాక్ తప్పిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రియులు.
సెకండాఫ్‌లో కాపురాన్ని చక్కదిద్దడానికి లీలా వేసే ప్లాన్స్ మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. కామెడీ కోసం ఇరికించిన సప్తగిరి దొంగ క్యారెక్టర్, మొట్ట రాజేంద్రన్ అడల్ట్ వెబ్ షో ట్రాక్ నవ్వులు పూయించకపోగా విసుగు తెప్పిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కుటుంబ కథా చిత్రమే అయినా.. అక్కడక్కడా డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టడం మైనస్ గా మారింది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉన్నా, సరైన లాజిక్ లేకపోవడంతో అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు.
నటీనటుల పర్ఫార్మెన్స్ ..
లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి ఒదిగిపోయింది. అటు గ్లామర్, ఇటు యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో వన్-మ్యాన్ షో చేసింది. దేవ్ మోహన్ లుక్స్ పరంగా బాగున్నా, తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు. మడోన్నా సెబాస్టియన్ పాత్ర చాలా బలహీనంగా ఉంది. వీటీవీ గణేష్, నరేశ్ ఉన్నంతలో బాగానే చేశారన్న టాక్ ను సొంతం చేసుకున్నారు.
మ్యూజిక్ ఒకే .. కానీ..
మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ బాగుంది, ముఖ్యంగా ఫస్టాఫ్‌లోని వెడ్డింగ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. బినేంద్ర మేనన్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కానీ, సెకండాఫ్‌లో ఎడిటర్ కాస్త పెంచాల్సింది అన్న భావన వ్యక్తం అవుతోంది. దర్శకుడు తాతినేని సత్య ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. స్క్రీన్‌ప్లేను మరింత గ్రిప్పింగ్‌గా రాసుకోవాల్సింది సామాన్య ప్రేక్షకుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. మంచి మెసేజ్, పర్‌ఫెక్ట్ ఫస్టాఫ్‌తో మెప్పించిన ‘సతీ లీలావతి’.. వీక్ సెకండాఫ్, అన్‌వాంటెడ్ కామెడీ ట్రాక్స్ వల్ల యావరేజ్‌గా మిగిలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది..మిశ్రమ స్పందనను అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడతుందో చూడాలి మరి.
