చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు PAN కార్డ్ ఉంటే, వారి ఆదాయంపై పన్ను స్లాబ్ పరిమితి వరకు ఎలాంటి పన్ను పడదని భావిస్తుంటారు. ముఖ్యంగా రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు కాబట్టి.. బంధువులు కాని వారి నుంచి వచ్చే గిఫ్ట్‌లపై కూడా పన్ను ఉండదని అనుకోవడం పొరపాటు. అయితే ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పిల్లలకు ఆర్థిక గిఫ్ట్ అవ్వటం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
గిఫ్ట్ టాక్స్ రూల్స్:
ఆదాయపు పన్ను చట్టం 2025 (సెక్షన్ 92(2)(m)) ప్రకారం.. ఒక వ్యక్తికి ఒక సంవత్సరంలో లభించే మొత్తం గిఫ్ట్‌ల విలువ రూ.50వేలు దాటితే అది వారి ఆదాయంగా పరిగణించబడుతుంది. ఒకవేళ ఈ గిఫ్ట్‌లు తల్లిదండ్రులు, తాతలు, మేనమామలు మొదలైనవారి నుంచి వస్తే పన్ను ఉండదు. కానీ బంధువులు కాని వారి నుంచి శిశువుకు రూ.12 లక్షలు క్యాష్ రూపంలో బహుమతిగా వస్తే.. దానిని ఆ శిశువు ఆదాయంగానే పరిగణిస్తారు చట్ట ప్రకారం.
క్లబ్బింగ్ రూల్స్:
మైనర్ పిల్లలకు వచ్చే ఆదాయంపై పన్ను విషయంలో అత్యంత కీలకమైనది క్లబ్బింగ్. మైనర్ బిడ్డకు వచ్చే ఇలాంటి ఆదాయాన్ని ఆ బిడ్డ తల్లిదండ్రులలో ఎవరికైతే ఎక్కువ ఆదాయం ఉంటుందో.. వారి ఆదాయానికి క్లబ్ చేసి అదే కలిపి పన్ను లెక్కిస్తారు. కేవలం రూ.15 వందల వరకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. అంటే రూ.12 లక్షల గిఫ్ట్ మీ ఆదాయానికి జతచేయబడి.. పేరెంట్ ఏ టాక్స్ స్లాబ్‌లో ఉంటే ఆ రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
బంధువులు కాని వారి నుంచి పెద్ద మొత్తంలో గిఫ్ట్‌లు వచ్చినప్పుడు పన్ను అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది. ఆ డబ్బు ఇచ్చిన వారి క్రెడెన్షియల్స్ నిరూపించలేకపోతే, దానిని అన్‌ఎక్స్‌ప్లైన్డ్ క్రెడిట్ గా పరిగణించి భారీ పెనాల్టీతో కూడిన పన్ను విధిస్తారు. ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన రూల్స్ ప్రకారం రూ.60వేల వరకు ట్యాక్స్ రిబేట్ ఉన్నప్పటికీ.. అది సాధారణ ఆదాయానికి మాత్రమే వర్తిస్తుంది.
మరి పిల్లల పేరిట సంపద సృష్టి ఎలా?
పన్ను భారం లేకుండా పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు దాచడానికి PPF అకౌంట్ బెస్ట్. పీపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. క్లబ్బింగ్ రూల్స్ వల్ల ఎలాంటి అదనపు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది చట్టబద్ధంగా పిల్లల పేరిట సంపదను పెంచడానికి సురక్షితమైన మార్గం.
