క్లౌడ్‌ఫ్లేర్ షాకింగ్ నిర్ణయం: ఏఐ వాడకంతో 11 వందల మంది లేఆఫ్

క్లౌడ్‌ఫ్లేర్ షాకింగ్ నిర్ణయం: ఏఐ వాడకంతో 11 వందల మంది లేఆఫ్

ప్రముఖ గ్లోబల్ కనెక్టివిటీ క్లౌడ్ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) టెక్ ప్రపంచంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ ప్రభావంతో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 1,100 మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు కంపెనీ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్ లో వివరాలను వెల్లడించింది. ఇది సాధారణ ఖర్చుల తగ్గింపు చర్య కాదని, మారుతున్న ‘ఏజెంటిక్ ఏఐ’ అవసరాలకు అనుగుణంగా కంపెనీని తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగానే లేఆఫ్స్ చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.

క్లౌడ్‌ఫ్లేర్ అంతర్గత కార్యకలాపాల్లో గత 3 నెలల్లోనే ఏఐ వినియోగం ఏకంగా 600 శాతానికి పైగా పెరిగింది. ఇంజనీరింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్ వంటి విభాగాల్లోని ఉద్యోగులు రోజువారీ పనుల కోసం ఏఐ ఏజెంట్లను వాడుతున్నారు కంపెనీలో. దీనివల్ల పనితీరు మెరుగుపడటమే కాక.. కొన్ని పాత పని విధానాల అవసరం తగ్గిందని కంపెనీ విశ్లేషించింది. అందుకే ప్రతి విభాగం, ప్రతి పాత్రను ఏఐ కోణంలో తిరిగి అంచనా వేస్తున్నామని, తద్వారా సంస్థను మరింత వేగంగా, వినూత్నంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది సంస్థ.

ఉద్యోగాలు కోల్పోతున్న వారి పట్ల క్లౌడ్‌ఫ్లేర్ సానుకూల ధోరణిని ప్రదర్శించింది. ఈ తొలగింపులు ఆయా వ్యక్తుల పనితీరు లేదా ప్రతిభకు సంబంధించినవి కావని కంపెనీ స్పష్టంగా చెప్పింది. బాధిత ఉద్యోగులకు భారీ సెవెరెన్స్ ప్యాకేజీని కూడా ప్రకటించింది. 2026 చివరి వరకు పూర్తి బేస్ పే, ఏడాది చివరి వరకు హెల్త్‌కేర్, అదనపు ఈక్విటీ వెస్టింగ్ ప్రయోజనాలను అందించనుంది. ఏడాది పూర్తికాని వారికి కూడా ప్రో-రేటెడ్ ప్రాతిపదికన ఈ ప్రయోజనాలు అందజేయనున్నారు.

నిరంతరం లేఆఫ్స్ చేస్తూ ఉద్యోగుల్లో అనిశ్చితిని సృష్టించడం ఇష్టం లేక, ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఒకే దశలో పూర్తి చేయాలని క్లౌడ్‌ఫ్లేర్ నిర్ణయించింది. ఏఐ వల్ల టెక్ పరిశ్రమలో పనిచేసే పద్ధతులు మారుతున్న వేళ పోటీని తట్టుకుని నిలబడాలంటే ఈ మార్పులు తప్పవని కంపెనీ భావిస్తోంది. ఏఐ ఉత్పత్తులు, సేవల్లో భారీ పెట్టుబడులు పెడుతూ, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తనను తాను సిద్ధం చేసుకునే పనిలో క్లౌడ్‌ఫ్లేర్ ఉంది ప్రస్తుతం.