కొత్త లేబర్ కోడ్స్ 'హెల్త్' గిఫ్ట్.. 40 ఏళ్లు దాటిన కార్మికులకు ఏటా ఫ్రీ హెల్త్ చెకప్

కొత్త లేబర్ కోడ్స్ 'హెల్త్' గిఫ్ట్.. 40 ఏళ్లు దాటిన కార్మికులకు ఏటా ఫ్రీ హెల్త్ చెకప్

దేశంలోని కోట్లాది మంది శ్రామికుల ఆరోగ్యం, సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త లేబర్ కోడ్‌ల కింద 40 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కార్మికులందరికీ దేశవ్యాప్తంగా ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ స్కీమ్ ముఖ్యంగా అన్ ఆర్గనైజ్డ్ రంగంతో పాటు ప్రమాదకర పనుల్లో నిమగ్నమైన కార్మికులకు వరంలా మారనుంది. గత దశాబ్ద కాలంలో సామాజిక భద్రత కవరేజీ 30 కోట్ల నుండి ఏకంగా 94 కోట్ల మందికి పెరిగిందని.. ఇది దేశ జనాభాలో 19 శాతం నుండి 64 శాతానికి చేరుకుందని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కొత్త నిర్ణయం ద్వారా ఇటు శ్రమ శక్తి.. అటు యువ శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, పని ప్రదేశాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

స్కీమ్ ప్రధానంగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే కార్మికులందరికీ వర్తిస్తుంది. 40 ఏళ్లు పైబడిన వారు ప్రతి సంవత్సరం ఉచితంగా హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. ముఖ్యంగా 10 కంటే తక్కువ మంది పనిచేసే చిన్న సంస్థల్లోని ఉద్యోగులు, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవారిని కూడా ఇప్పుడు ESIC పరిధిలోకి తీసుకువచ్చారు. దీనివల్ల సాధారణ తనిఖీలతో పాటు, వ్యాధులను ముందస్తుగా గుర్తించడం సాధ్యమవుతుంది. ఒకవేళ పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు బయటపడితే.. వాటికి అవసరమైన మందులు, చికిత్సను ESIC ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తారు.

మహిళా కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటికే ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడంతో పాటు, సమాన వేతనం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు హెల్త్ చెకప్స్ కూడా తోడవ్వడంతో మహిళా కార్మికులకు మరింత భద్రత చేకూరనుంది. దేశవ్యాప్తంగా 11 ప్రధాన ESIC ఆసుపత్రుల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.