గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు.. కాంగ్రెస్ సోషల్ మీడియాకు నోటీసులు

గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు.. కాంగ్రెస్ సోషల్ మీడియాకు నోటీసులు

ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు.. కేంద్ర హోంశాఖకు బీజేపీ కంప్లయింట్ చేయటంతో.. విచారణ కోసం ఆఘమేఘాలపై హైదరాబాద్ వచ్చారు ఢిల్లీ పోలీసులు. బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా.. తెలంగాణలోని ఓ బహిరంగ సభలో రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు.. ఆ వీడియోను ఎడిటింగ్ చేసి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం అన్న అర్థం వచ్చేలా వీడియో రిలీజ్ అయ్యిందని.. అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యిందని.. దీంతో నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు ఢిల్లీ పోలీసులు.

అమిత్ షా తెలంగాణాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియోని ఎడిట్ చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  సిద్దిపేటలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన అమిత్ షా.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రసంగాన్ని పలువురు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. విచారణలో భాగంగా హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు  వచ్చిన ఢిల్లీ పోలీసులు.. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నె సతీష్ కు సీఆర్పీసీ 91 ప్రకారం నోటీసులు ఇచ్చారు. 

అమిత్ షా వీడియో ఎడిట్ చేసి వైరల్ చేసినందుకు తెలంగాణ బీజేపీ నేతలు కూడా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరికి సమాన్లు పంపారు. మే 1న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.