ఢిల్లీలో బీజేపీ నిరసన.. వాటర్ కెనాన్లతో చెదరగొట్టిన పోలీసులు

ఢిల్లీలో బీజేపీ నిరసన.. వాటర్ కెనాన్లతో చెదరగొట్టిన పోలీసులు

ఢిల్లీ మేయర్ ఎన్నికలో జనవరి 6న జరిగిన హింసకు వ్యతిరేకంగా.. బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీఎం కేజ్రీవాల్ ఇంటి ఎదుట నిరసన చేపట్టి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేయర్ ఎన్నికల్లో ఘర్షణకు కారణమైన కౌన్సిలర్లను సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అలాగే.. ఇంతకు ముందెన్నడూ మహిళా కౌన్సిలర్ల పై దాడులు జరగలేదని ఆరోపించింది. దీంతో నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వాటర్ కెనాన్ ప్రయోగించారు. బీజేపీ నిరసనకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. మేయర్ ఎన్నికలో బీజేపీ రిగ్గింగ్ చేసిందని ఆరోపించారు. మరోవైపు మున్సిపల్ కౌన్సిలర్లను సస్పెండ్ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని బీజేపీ హెచ్చరించింది.

కొత్త మేయర్‭ను ఎన్నుకునే సమావేశంలో ఇటీవల భారీ ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. మేయర్ ఎన్నికలకు ముందు ఎమ్ సీడీ ఛాండర్‭లో బీజేపీ, ఆఫ్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ జరిగింది. నామినేటెడ్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారోత్సవం సందర్బంగా గందరగోళం నెలకొంది. ఎన్నికైన కౌన్సిలర్లను కాకుండా ముందుగా నామినేటెడ్ కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయాలని పిలవడంతో ఆప్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ కారణంగా మేయర్ ఎన్నిక కోసం జరగాల్సిన ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై స్పందించిన బీజేపీ ఆప్ భయపడుతోందని.. ఆ పార్టీ నైతికంగా ఓడిపోయిందని వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆప్ కౌన్సిలర్లు కూడా బీజేపీ పై విమర్శలు చేశారు. ఇది కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. దీనిపై మరోసారి బీజేపీ కార్యకర్తలు నిరసన చేస్తున్నారు.