ఫన్ కోసమే బాంబు.. బెదిరింపు మెయిల్ చేశా

ఫన్ కోసమే బాంబు.. బెదిరింపు మెయిల్ చేశా

న్యూఢిల్లీ : ఢిల్లీలోని మధుర రోడ్‌ లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌‌(డీపీఎస్) బాంబు బెదిరింపు కేసును పోలీసులు ఛేదించారు. అదే స్కూల్ కు చెందిన ఓ స్టూడెంటే(16) ఈ బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం వెల్లడించారు. విద్యార్థి కేవలం సరదా కోసమే స్కూల్​కు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు చెప్పాడని తెలిపారు. ఇటీవల ఢిల్లీలోని సాదిక్ నగర్‌లోని 'ది ఇండియన్ స్కూల్'కు వచ్చిన బాంబు బెదిరింపు ఘటనతో తనకు ఈ ఆలోచన వచ్చినట్లు మైనర్ వెల్లడించాడని వివరించారు. స్టూడెంట్ మైనర్ కావడంతో అదుపులోకి తీసుకోలేదని, విచారించలేదని పోలీసులు తెలిపారు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశామన్నారు.

మధుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌‌కు బుధవారం(ఏప్రిల్ 26)న ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్‌ వచ్చింది. అందులో పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు, బాంబు స్వ్కాడ్‌ స్కూల్ వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆ స్కూల్ స్టూడెంటే తన సరద కోసం బెదిరింపు మెయిల్స్ పంపినట్లు తెలింది. గత నెలలో 'ది ఇండియన్ స్కూల్'లో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే , బెదిరింపు మెయిల్ ఫేక్ అని తేలింది.  ఈ కేసులో నిందితుడి ఆచూకీ తెలియాల్సి ఉంది.