ఇండియా విమానం.. రష్యాలో ల్యాండ్.. ఏం జరిగింది

ఇండియా విమానం.. రష్యాలో ల్యాండ్.. ఏం జరిగింది

ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా రష్యాలో ల్యాండ్ అయింది. ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రష్యాలో ఎమర్జెన్సీ లాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ విమానాన్ని రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిర్ ఇండియాకు చెందిన AI73 నెంబర్ గల విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలెట్లు గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని రష్యావైపు మళ్లించారు. అనంతరం రష్యాలోని మగడాన్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సమయంలో  విమానంలో 216 మంది ప్రయాణికులు..,16 మంది ఎయిర్ ఇండియా సిబ్బంది ఉన్నారు.  మగడాన్ ఎయిర్ పోర్టులో  దిగిన వెంటనే ప్రయాణికులకు వసతి కల్పించారు. వారిని గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 

2023  ఏప్రిల్‌లో చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని  కూడా మళ్లించారు. ప్రతికూల వాతావరణం  కారణంగా మలేషియాకు అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చింది. 

ఎయిర్ ఇండియా వివాదాలు 

ఎయిర్ ఇండియాను టాటాసన్స్ కొనుగోలు చేసిన తర్వాత ఈ సంస్థ తరచూ వివాదాల్లో నిలుస్తూనే ఉంది. 2022  నవంబర్ 26న మద్యం మత్తులో శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు తన సహ ప్రయాణికురాలిపై  మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ  ఘటనలో  ఎయిర్ ఇండియా సిబ్బంది వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అనేక వివాదాలు ఎయిర్ ఇండియాను చుట్టుముడుతూనే ఉన్నాయి. ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికురాలికి వడ్డించిన భోజనంలో రాయి వచ్చింది. దీంతో మరోసారి ఈ ఎయిర్ లైన్స్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి.