- తెల్లవారుజామున 3.48 గంటలకు చెలరేగిన మంటలు
- 15 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది
- మొరాయించిన స్మార్ట్ లాక్.. సహాయక చర్యలకు ఆటంకం
- మొదటి అంతస్తులో ఒకరు, రెండో అంతస్తులో ఐదుగురు, మేడపై మెట్ల మార్గంలో ముగ్గురు మృత్యువాత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగగా రెండు కుటుంబాలకు చెందిన 9 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:48 గంటలకు తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ఫేజ్–-1 లోని 4 అంతస్తుల భవనంలో ఏసీ పేలిపోయి మంటలు చెలరేగాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే భవనంలోని రెండు, మూడు, నాలుగు అంతస్తులు అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందిన వెంటనే 14 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భవనంలోని రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లో మంటలు వేగంగా వ్యాపించాయి. సుమారు రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మొదటి అంతస్తులో ఒకరు, రెండో అంతస్తులో ఐదుగురు, మేడపై ఉన్న మెట్లపై ముగ్గురు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. సహాయక బృందాలు 20 మందిని కాపాడగా, స్వల్ప గాయాలైన ఇద్దరిని గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. భవనం వెనుక వైపు గేటుకు గ్రిల్స్ ఉండటం, టెర్రస్ తలుపులు వేసి ఉండటంతో రెస్క్యూకు ఆటంకం కలిగింది. పైకప్పు తలుపు తెరిచి ఉంటే ఆ ముగ్గురైనా ప్రాణాలతో ఉండేవారని అని అగ్నిమాపక అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
ప్రమాదానికి కారణాలివే..
తెల్లవారుజామున భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఏసీ యూనిట్ ఒక్కసారిగా పేలడంతో మంటలు మొదలైనట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 8 కుటుంబాలు గాఢ నిద్రలో ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు, ఇంట్లోని చెక్క ఫర్నిచర్ వల్ల క్షణాల్లో భవనం అంతటా వ్యాపించాయి. భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న స్మార్ట్ డోర్ లాక్‌లు విఫలం కావడం ప్రమాద తీవ్రతను పెంచింది. షార్ట్ సర్క్యూట్ వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో స్మార్ట్ లాక్‌లు మొరాయించి లోపలి నుంచి తెరుచుకోలేదు. రెండో అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులు బయటకు రాలేక గదిలోనే ప్రాణాలు విడిచారు. మొదటి అంతస్తులో కూడా ఒక వ్యక్తి ఇదేకారణంతో మరణించినట్లు సమాచారం. నిర్మాణ లోపాలు, అడ్డగోలు రక్షణ ఏర్పాట్లు సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్టు ఫైర్ సిబ్బంది వెల్లడించారు. మంటల నుంచి తప్పించుకోవడానికి పై అంతస్తులోని ముగ్గురు వ్యక్తులు మేడ మీదకు వెళ్లడానికి ప్రయత్నించారు. టెర్రస్ తలుపు తాళం వేసి ఉండటంతో బయటపడలేక మెట్లపైనే కుప్పకూలిపోయారు. ఫ్లాట్ల బాల్కనీలకు అమర్చిన ఇనుప గ్రిల్స్, పక్షులు రాకుండా వేసిన నెట్లు అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డాయి. వాటిని కట్ చేయడానికి చాలా సమయం పట్టడంతో ప్రాణనష్టం పెరిగింది. ఎనిమిది ఫ్లాట్లకు కలిపి ఒకే ఒక ఇరుకైన మెట్ల దారి ఉండటం వల్ల అందరూ ఒకేసారి బయటకు రావడానికి వీలు పడలేదు. అగ్నిమాపక సిబ్బందికి తెల్లవారుజామున 3:47 గంటలకు సమాచారం అందగా, 4:05 గంటల కల్లా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే భవనం చుట్టూ ఖాళీ స్థలం లేకపోవడం, పక్కపక్కనే ఇళ్లు ఉండటంతో మంటలను ఆర్పడం సవాలుగా మారింది.
గవర్నర్, సీఎం సంతాపం..
ఈ విషాద ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు, సీఎం రేఖా గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం, పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ గోయల్ తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
