- బీఎస్6 ప్రమాణాలు లేని, ఢిల్లీ బయట రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్‌కు వర్తింపు
- సిటీలో వాయు కాలుష్యం పెరిగిన నేపథ్యంలో సర్కారు చర్యలు
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కారు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బీఎస్ 4 ఎమిషన్ స్టాండర్డ్స్ తో కూడిన, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన అన్ని కమర్షియల్ గూడ్స్ వాహనాలకు సిటీలోకి ప్రవేశాన్ని నిషేధించింది. శనివారం (నవంబర్1) నుంచే ఈ నిషేధం అమలులోకి వచ్చింది.
ఢిల్లీలో కొనసాగుతున్న కాలుష్య సమస్యను పరిష్కరించడం కోసం పలు చర్యలు చేపట్టాలని గత నెల17న కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులతో సంయుక్తంగా ఏర్పడిన ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు వాహనాలను కంట్రోల్ చేస్తున్నాయి. ఢిల్లీలోని ప్రధాన మార్గాలైన కుండ్లి, రాజోక్రి, తిక్రి, అయా నగర్, కాళింది కుంజ్, ఔచాండి, మండోలి, కపాషెరా, బజ్‌గేరా టోల్/ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సరిహద్దులతో సహా మొత్తం 23 రూట్లలో బృందాలను మోహరించారు.
అయితే, ఢిల్లీలో రిజిస్టర్ అయిన బీఎస్- 6 ఎమిషన్ స్టాండర్డ్స్ లేని వాణిజ్య వాహనాలకు మాత్రం ఆంక్షలు వర్తించవని అధికారులు పేర్కొన్నారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరిగిపోయిన దృష్ట్యా నేషనల్ క్యాపిటల్ రీజన్(ఎన్సీఆర్) పరిధిలో ఈమేరకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్-) కాలుష్య నివారణ చర్యలు అమలులోకి వచ్చాయి. అలాగే నిర్మాణ పనులపై కూడా సర్కారు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా బొగ్గు, కట్టెలు కాల్చడం, డీజిల్ జనరేటర్ సెట్ల వినియోగం బ్యాన్ చేసింది. కాగా, వాయు కాలుష్యం వల్లే శ్వాసకోశ, దగ్గు, చాతీ, గొంతు నొప్పి వంటి సమస్యలతో తీవ్రంగా బాధ పడుతున్నామని ఢిల్లీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్షీణించిన ఎయిర్ క్వాలిటీ
ఢిల్లీలో రోజురోజుకూ ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం కూడా గాలి నాణ్యత సూచీ అత్యంత పేలవమైన స్థాయిలో నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం పోస్ట్ చేసింది.
ఈ డేటా ప్రకారం.. శనివారం ఉదయం 8 గంటలకు ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 245గా నమోదైంది. ఆనంద్ విహార్‌లో 298, అలీపూర్‌లో 258, అశోక్ విహార్‌లో 287, బురారీ క్రాసింగ్ వద్ద 264, ఓఖా ఫేజ్‌లో 248, పట్‌పట్‌గంజ్ ప్రాంతంలో 274 ఏక్యూఐ రికార్డ్ అయింది.
