న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం క్రీడా రంగంపైన ప్రభావం చూపిస్తోంది. ఫైన్ అయినా కడతా కానీ ఢిల్లీలో మాత్రం ఆడేందుకు ససేమిరా అన్నాడు ప్రపంచ నెంబర్ 2 బ్యాడ్మింటన్ ప్లేయర్. అతడు ఢిల్లీలో ఆడేందుకు నిరాకరించడానికి ప్రధాన కారణం దేశ రాజధానిలోని ఎయిర్ పొల్యూషనే.
ఇండియన్ ఓపెన్-2026 బ్యాడ్మింటన్ టోర్నీ 2026, జనవరి 13 నుంచి 18 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది. అయితే.. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రపంచ నంబర్ 2, డెన్మార్క్ ఆటగాడు ఆండర్స్ ఆంటన్సెన్ ప్రకటించాడు. ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం వల్ల ఈ టోర్నీలో పాల్గొనడం అసాధ్యమని తేల్చి చెప్పాడు. ఎయిర్ పొల్యూషన్ నేపథ్యంలో ఈ టోర్నీ నిర్వహణకు ఢిల్లీ సరైన వేదిక కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
సమ్మర్ సీజన్ అయితే ఢిల్లీలో టోర్నీ నిర్వహణకు బాగుంటుందన్నాడు. ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా వరుసగా మూడోసారి ఈ టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. ఇండియన్ ఓపెన్ టోర్నీ బ్యాడ్మింటన్ క్యాలెండర్‌లో ప్రధాన ఈవెంట్ కావడంతో నిబంధనల ప్రకారం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) తనకు 5 వేల అమెరికా డాలర్లు జరిమానా విధించిందని వెల్లడించాడు.
మరోవైపు.. ఆండర్స్ ఆంటన్సెన్ ఆరోపణలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ఖండించింది. టోర్నీ నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది. గాలి కాలుష్యం నేపథ్యంలో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపింది. ఏదేమైనప్పటికీ ఎయిర్ పొల్యూషన్ కారణంగా వరల్డ్ రెండో ర్యాంకర్ టోర్నీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో మరోసారి ఢిల్లీ గాలి కాలుష్యంపై చర్చ మొదలైంది.
