ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. రెడ్ జోన్ లో దేశరాజధాని..

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. రెడ్ జోన్ లో దేశరాజధాని..

ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. దీపావళి సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మంగళవారం ( అక్టోబర్ 21 ) ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451 పాయింట్లకు చేరినట్లు తెలుస్తోంది.ఇది దేశ సగటు కంటే రెండింతలు అధికమని తెలుస్తోంది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. భారీగా పెరిగిన కాలుష్యం వల్ల జనం ముక్కు, కళ్ళు, గొంతులో మంట, దురద వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

మాస్క్ లేకుండా బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు డాక్టర్లు. గత సంవత్సరం దీపావళి తర్వాత రోజున 296 పాయింట్ల ఏక్యూఐ నమోదుకాగా.. ఈసారి దీపావళి రోజు సాయంత్రానికే 345 పాయింట్లు దాటినట్లు తెలుస్తోంది. పటాకుల మోతతో సోమవారం రాత్రికే ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది దీపావళికి గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా..  రాత్రి 8 నుంచి 10 గంటల దాకా మాత్రమే పటాకులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. కోర్టు ఆదేశాలు జనం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వాయు కాలుష్యం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.దీపావళికి ఆరు రోజుల ముందు నుంచే ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడం గమనార్హం.. 

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 100 లోపు ఉంటే కాలుష్యం లేదని.. ఎయిర్ క్వాలిటీ బాగుందని అర్థం. ఏక్యూఐ 100 నుంచి 200 మధ్య   మధ్యస్తంగా ఉందని, 200 నుంచి 300 మధ్య ఉంటే ఎయిర్ క్వాలిటీ అద్వాన్నంగా ఉందని, అదే 300 నుంచి 400 మధ్య ఉంటే మరింత అధ్వాన్నంగా ఉందని, 400 నుంచి 500 మధ్య ఉంటే పొల్యూషన్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ చెబుతుంది.