ఫ్లైట్​లో తల్లీకూతుళ్లపై లైంగిక వేధింపులు

ఫ్లైట్​లో తల్లీకూతుళ్లపై లైంగిక వేధింపులు

ఎయిర్ లైన్స్​పై  రూ. 16 కోట్లకు దావా

న్యూయార్క్ : ఓ వ్యక్తి విమానంలో ఫుల్లుగా తాగి.. తల్లీకూతుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితులు ఈ విషయాన్ని ఫ్లైట్ సిబ్బందికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. పైగా ఆ వ్యక్తికి మద్యం సరఫరా చేస్తూ వచ్చారు. పోయినేడాది జులైలో ఈ ఘటన జరగ్గా.. బాధితులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. తమ విషయంలో ఎయిర్ లైన్స్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ రూ.16 కోట్లకు దావా వేశారు. 2022 జులై 26న న్యూయార్క్ లోని జేఎఫ్ కే ఎయిర్ పోర్టు నుంచి గ్రీస్ లోని అథెన్స్ కు డెల్టా ఎయిర్ లైన్ కు చెందిన విమానం బయలుదేరింది. అందులో ఓ మైనర్ తన తల్లితో కలిసి ప్రయాణం చేసింది. వీళ్ల పక్కన కూర్చున్న ఓ వ్యక్తి.. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఫుల్లుగా మద్యం తాగాడు. కొద్దిసేపటికి పక్కనున్న మైనర్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక తన తల్లికి విషయం చెప్పింది. తల్లి ఆ వ్యక్తికి వార్నింగ్ ఇవ్వగా, అతడు మరింత రెచ్చిపోయాడు.

తల్లీకూతుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితులు ఈ విషయాన్ని ఫ్లైట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. సీటు మార్చాలని కోరారు. కానీ సిబ్బంది పట్టించుకోలేదు. పైగా దాదాపు 11 సార్లు అతనికి ఆల్కహాల్ ఇచ్చారు. ఫ్లైట్ టేకాఫ్ అయింది మొదలు.. ల్యాండ్ అయ్యే వరకు దాదాపు 9 గంటల పాటు ఆ వ్యక్తి తాగుతూ తల్లీకూతుళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. తీరా ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఏమీ ఎరగనట్టు దిగి వెళ్లిపోయాడు. ఫ్లైట్ సిబ్బంది కూడా అతనిపై పైఅధికారులకు ఫిర్యాదు చేయలేదు. తల్లీకూతుళ్లకు క్షమాపణ చెప్పి, కూపన్లు ఇచ్చి పంపించారు. దీనిపై బాధితులు రూ.16 కోట్ల పరిహారం ఇప్పించాలని న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.