- 550 ఎంజీడీల నుంచి 570కు పెరిగిన డిమాండ్
- సరిపడా వాటర్సప్లై జరగడం లేదంటున్న జనం
- వచ్చే నెల నుంచి సప్లై పెంచేందుకు వాటర్ బోర్డు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: ఎండలు క్రమంగా పెరుగుతుండటంతో గ్రేటర్‌వ్యాప్తంగా తాగు నీటికి డిమాండ్పెరిగింది. మొన్నటి వరకు 550 ఎంజీడీ(మిలియన్ గ్యాలన్ పర్డే)లు అవసరం ఉండగా, ప్రస్తుతం 560 నుంచి 570 ఎంజీడీలకు పెరిగింది. జనం అవసరానికి తగ్గట్లుగా నీటి సరఫరాను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వాటర్‌బోర్డు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు చెప్పిన దానికంటే ఎక్కువ నీటి డిమాండ్ఉన్నట్లు కనిపిస్తోంది. చాలా ప్రాంతాలకు నీటి సరఫరా లేదని, కొన్ని ప్రాంతాలకు అరకొరగా చేస్తున్నారని వాటర్ బోర్డుకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల లోప్రెషర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. సిటీలోని చాలా ప్రాంతాల్లో రోజు మార్చి రోజు నల్లా నీళ్లు సరఫరా చేస్తుండగా, కొన్ని ప్రాంతాలకు మాత్రం మూడు, నాలుగు రోజులకోసారి వదులుతున్నారు. చాలాచోట్ల 20 నిమిషాలకు మించి సరఫరా కావడం లేదని జనం వాపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో నీటి వినియోగం ఎక్కువైంది. నల్లా నీళ్లు సరిపోక కొన్ని కాలనీల వాసులు వాటర్‌ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. వాటర్‌బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీటి సమస్య లేదని ప్రచారం
సిటీలో ఎక్కడా తాగు నీటి సమస్య లేదని, సరిపడా అందిస్తున్నామని వాటర్‌బోర్డు అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడితో జనం అల్లాడుతున్నారు. ఏదో ఒక కారణంతో నీటి సరఫరా అవకపోతుండటంతో వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. కలుషిత నీరు, పైప్లైన్ల డ్యామేజ్, రిపేర్లు ఇలా వేర్వేరు కారణాలతో నీటి సరఫరా జరగడంలేదు. కూకట్ పల్లిలోని ప్రశాంతినగర్ లో 30 రోజులుగా నీటి సమస్య ఉందని వాటర్ బోర్డుకి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వినోద్ రెడ్డి అనే వ్యక్తి ఐదురోజుల క్రితం మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్చేసి ట్వీట్ చేశాడు. ఇలా అనేక ప్రాంతాల నుంచి డైలీ ఫిర్యాదులు
వస్తున్నాయి.
అదనంగా అడిగితే ఫిర్యాదు చేయండి
వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకున్న తర్వాత ఆపరేటర్ అదనంగా డబ్బు డిమాండ్ చేస్తే155313కు కాల్చేసి ఫిర్యాదు చేయొచ్చని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. అలాగే స్థానిక డివిజన్ ఆఫీసులో నేరుగా అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామంటున్నారు.
ఇదే అదునుగా దోపిడీ
వాటర్‌బోర్డు అందించే వాటర్ ట్యాంకర్లు లేటుగా వస్తుండడంతో జనం ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ట్యాంకర్ల ఆపరేటర్లు దోపిడీకి దిగుతున్నారు. వాటర్‌బోర్డు అందించే 5 వేల లీటర్ల పెయిడ్ట్యాంకర్ కు రూ.500, కమర్షియల్ ట్యాంకర్లకు రూ.850 తీసుకోవాలి. కానీ ట్యాంకర్ తీసుకొచ్చాక ఆపరేటర్లు డబుల్అమౌంట్డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా వాటర్ బోర్డు ట్యాంకర్లు అందుబాటులో లేక చాలా మంది ప్రైవేటు ట్యాంకర్లు బుక్చేసుకుంటున్నారు. ప్రైవేట్ఆపరేటర్లు 5 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.1000–1500, 10 వేల లీటర్ల ట్యాంకర్ కు రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు.
