ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీసీ కులాల కార్పొరేషన్లకు దామాషా ప్రకారం నిధులు మంజూరు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఆదివారం నల్లకుంటలో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లను ధ్వంసం చేసిందని ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి సర్కార్ వివిధ బీసీ కులాల కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించి సరిపెట్టుకోకుండా, కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేసి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు.
