పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి : రవీందర్ రెడ్డి

పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి : రవీందర్ రెడ్డి
  • మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీకి రవీందర్ రెడ్డి వినతి

హైదరాబాద్, వెలుగు: పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ (ఎస్సై) ఉద్యోగాల నియామకాలకు వయోపరిమితిని పెంచాలని ఎకనామికల్లీ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ( ఈబీసీ ) జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మంత్రి శ్రీధర్ బాబును, డీజీపీ ఆఫీస్ లో సీవీ ఆనంద్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని కానిస్టేబుల్ పోస్టులకు 36 ఏండ్లకు, ఎస్సై పోస్టులకు 39 ఏండ్లకు పెంచాలని కోరారు.  

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోలీస్ పోస్టులను సమగ్రంగా గుర్తించి, వాటిని భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.  గతంలో ప్రభుత్వం జీవో 87 ద్వారా పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచినప్పటికీ, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మరింత అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పలువురు అభ్యర్థులు వయోపరిమితి కారణంగా ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని రవీందర్ రెడ్డి గుర్తు చేశారు.  ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు పోలీస్ శాఖలో సిబ్బంది కొరత కూడా కొంతవరకు తీరుతుందని ఆయన వివరించారు. ఈ అంశాన్ని ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు.