బ్రిజ్ హఠావో.. ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళన

బ్రిజ్ హఠావో.. ఢిల్లీలో  రెజ్లర్ల ఆందోళన

రెజ్లర్లను లైంగికంగా వేధించిన  బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ధర్నాలో 200 మందికిపైగా రెజ్లర్లు  పాల్గొన్నారు. వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర మహిళా రెజ్లర్లు వారికి మద్దతు తెలిపారు. కోచ్‌ల‌తో పాటు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సైతం మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని వినేశ్ ఫొగట్ ఆరోపించారు.  టోక్యో ఒలింపిక్స్‌ లో కాంస్య పతక విజేత  భజరంగ్ పూనియా సైతం రెజ్లర్ల ఆందోళనలో పాల్గొన్నాడు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సింగ్‌పై ఆయన కూడా ఆరోపణలు చేశాడు. రెజ్లర్ల కోసం పనిచేయాల్సిన ఫెడరేషన్.. వారిని వేధించడం ఏంటని ప్రశ్నించారు. 

రెజ్లర్ల ఆందోళనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర క్రీడా శాఖ.... 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని  రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. రెజ్లర్ల శ్రేయస్సుకు సంబంధించిన అంశం కావడంతో ఈ విషయాన్ని కేంద్ర క్రీడా శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో WFI  72 గంటల్లోగా వివరణ ఇవ్వనిపక్షంలో 2011  నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ ప్రకారం  చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అటు రెజ్లర్ల నిరసనల నేపథ్యంలో ఈ నెల 18 నుంచి లక్నోలో ప్రారంభం కావాల్సిన మహిళా రెజ్లింగ్ క్యాంప్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిపోర్టు చేసిన రెజ్లర్లు నేషనల్ క్యాంప్ నుంచి ఇంటికి వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. 

బ్రిజ్ భూషణ్ తో పాటు.. జాతీయ కోచ్ లు మహిళా రెజ్లర్లను  లైంగికంగా వేధిస్తున్నారని వినేశ్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేసింది.  ఒలింపిక్స్ లో తన ప్రదర్శన తర్వాత  తిట్టారని పేర్కొంది.  బ్రిజ్ భూషణ్ వేధింపుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి గురయ్యానని..ఒక సందర్బంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని కన్నీటిపర్యంతమైంది. రెజ్లర్లకు  గాయాలైతే కూడా ఎవరూ పట్టించుకోరని చెప్పింది. బ్రిజ్ భూషణ్ పై కంప్లేంట్ చేస్తే తనను చంపేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయని తెలిపింది. బ్రిజ్ భూషణ్ చాలా మంది  అమ్మాయిలను లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. 

రెజ్లింగ్ ఫెడరేషన్ లో ఉన్నవారికెవరికీ కూడా రెజ్లింగ్ గురించి తెలియదని భజరంగ్ పునియా అన్నాడు.  బ్రిజ్ భూషణ్ తిట్టేవారని..కొన్ని సందర్భాల్లో కొట్టారని వెల్లడించాడు.  తమ పోరాటం ప్రభుత్వం మీద కాదని.. ఫెడరేషన్..   అధ్యక్షుడి మీదేనని స్పష్టం చేశాడు. బ్రిజ్ భూషణ్ ను  పదవి నుంచి దింపేవరకూ  నిరసన కొనసాగిస్తామని వెల్లడించాడు. 

దేశం కోసం ఎంతో కష్టపడి పతకాలు తేస్తే..తమ కోసం ఫెడరేషన్ ఏమీ చేయదని సాక్షి మాలిక్ ట్వీట్ చేసింది. దీనికి తోడు..తమను వేధింపులకు గురి చేస్తోందని ట్విట్టర్ లో పేర్కొంది. ఇదిలా ఉంటే రెజ్లర్ల ఆరోపణలపై బీజేపీ ఎంపీ, WFI ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు రుజువైతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. భజరంగ్ పూనియాతో పాటు.. ఇతర రెజ్లర్లతో మాట్లాడాలనుకున్నానని.. కానీ కుదర్లేదని చెప్పారు.