- గోల్డెన్ అవర్ లో దవాఖానకు తీసుకెళ్తే ప్రాణాలు కాపాడినట్టే
- ఆపదలో ఆదుకున్న వారికి ‘రహవీర్’ స్కీం కింద రూ.25 వేలు ఇస్తున్న కేంద్రం
- ఈ ఏడాది మే వరకు 1,604 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 141 మంది మృతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారు. ఈ సమయంలో బాధితులను దవాఖానలో చేరిస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, చాలా మంది ఇది మెడికో లీగల్ కేసు అవుతుందని, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడుతున్నారు.
దీంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణలో గతేడాది సుమారు 27,300 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, దాదాపు 7,500 మంది మృతి చెందారు. మృతుల్లో 52.8 శాతం మంది బైక్ నడిపేవారు, 33.5 శాతం మంది పాదచారులు ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని దవాఖానకు తరలించకపోవడం వల్లే మరణాల రేటు పెరుగుతోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘రహవీర్’ పథకాన్ని తీసుకొచ్చింది. ఎవరైనా ప్రమాదంలో గాయపడితే వారిని మొదటి గంటలో దవాఖానకు తీసుకెళ్లిన వారిని ‘రహవీర్’గా గుర్తించి, రూ. 25 వేల నగదు ప్రోత్సాహకంతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తుంది. వీరు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాపాడిన వ్యక్తి తన పేరు చెప్పడానికి ఇష్టపడకపోతే వారి వివరాలను రహస్యంగా ఉంచుతారు.
ఐదు నెలల్లోనే 1,604 ప్రమాదాలు..
ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు హైదరాబాద్ నగర పరిధిలో 1,604 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 141 మంది ప్రాణాలు కోల్పోయారు. 86 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 1,377 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాల బారిన పడిన వారిలో 18 ఏండ్లలోపు పిల్లలు 128 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు మృతి చెందగా, 117 మంది గాయపడ్డారు.
ఫొటోలు, వీడియోలతోనే సరి..
ఎక్కడైనా కళ్లముందు ప్రమాదం జరిగితే బాధితులను కాపాడేవారు కరువయ్యారు. ఎవరైనా ప్రమాదంలో గాయపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే చూస్తూ పక్క నుంచి పోతున్నారే తప్ప.. ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదు. ఇంకొందరు సాయం చేయడానికి బదులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మరికొందరు కేవలం 100 లేదా 108 అంబులెన్స్‌కు డయల్ చేస్తున్నారే తప్పా ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదు. దీని వల్ల చాలా మందికి సకాలంలో చికిత్స అందక చనిపోతున్నారు.
అవగాహన లేకనే..
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్తే పోలీసు విచారణలో ఇరుక్కుపోతామనే భయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. ‘రహవీర్’ స్కీమ్ అందుబాటులోకి వచ్చిందని, ఎలాంటి కేసులు ఉండవని.. నగదు బహుమతితోపాటు ప్రశంసాపత్రం ఇస్తున్నా సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ముందుకు రావడం లేదు.
