
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్పేట, దిల్సుఖ్నగర్ ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ పాత బ్రిడ్జి కూల్చివేత పనులను బల్దియా అధికారులు బుధవారం మొదలుపెట్టారు. ఇప్పటికే ఓవైపు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా, పాత బ్రిడ్జి ఇటీవల మూసీకి వచ్చిన భారీ వరదలతో కోతకు గురైంది. పటిష్టతను పరిశీలించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు.. ఈ బ్రిడ్జి పైనుంచి వాహనాల రాకపోకలు సురక్షితం కాదని, కూల్చివేయాలని నిర్ణయించారు. పాత బ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మించాలని ప్రతిపాదించారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే పాత బ్రిడ్జిని కూల్చివేస్తున్నారు. అంబర్పేట, దిల్సుఖ్నగర్ మధ్య ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయంగా గోల్నాక బ్రిడ్జిపై నుంచి వెళ్లాలని అధికారులు
సూచిస్తున్నారు.