డెంగీ టెస్టులు ఫ్రీ

డెంగీ టెస్టులు ఫ్రీ

హైదరాబాద్, వెలుగు: డెంగీ పరీక్షలన్నీ ఫ్రీగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనాసుపత్రుల్లోనూ, హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రి,ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లోనూ డెంగీకి సంబంధించి ఎలైసా పరీక్ష ఉచితంగా చేయాలని నిర్ణయించింది. ఆయా ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో అందరికీ కనిపించేలా బోర్డులను ప్రదర్శించాలని సర్కారు నిర్ణయించింది.

అన్ని చోట్లా ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేయాలని, గంటకు మించి ఎవరూ వెయిట్ చేయకుండా చూసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బోధనాసుపత్రులు, ఫీవర్‌ ఆసుపత్రి, ఐపీఎంలకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కడా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టంచేసింది. ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసి డెంగ్యూ లేకున్నా ఉన్నట్టు పెషెంట్లను తప్పుదోవ పట్టిస్తే చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోలను ఆదేశించింది. అనుమానిత కేసుల బ్లడ్ సాంపిళ్లను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించి పరీక్షించాలని సూచించింది.

సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తుండటం, ముఖ్యంగా డెంగీ కేసులు వేలాదిగా నమోదు అవుతుండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు.. డెంగీ ఉన్నా లేకపోయినా తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్‌లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి