- మూడు నెలల్లో ఇంటి పట్టా ఇవ్వండి
- మాజీ సైనికుడి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
హైదరాబాద్: దేశ రక్షణలో సైనికులు అందించే సేవలు ప్రాంతీయ పరిమితులకు అతీతమైనవని, స్థానికత ఆధారంగా మాజీ సైనికుడికి ఇంటి పట్టాను నిరాకరించడం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా సదరు మాజీ సైనికుడికి మున్సిపల్ పరిధిలో ఇంటి పట్టా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అనే కారణంతో కూకట్‌పల్లికి చెందిన 80 ఏళ్ల మాజీ సైనికుడు పి. సీతారామరాజు దరఖాస్తును 2014లో రంగారెడ్డి కలెక్టర్ తిరస్కరించారు.
దీనిపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారించారు. పిటిషనర్ 1971 భారత్-పాక్ యుద్ధంలో పాల్గొని గాయపడ్డారు. అంగవైకల్యం కారణంగా 1975లో సైన్యం నుంచి తొలగింపునకు గురై, అప్పటినుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. నిబంధనల ప్రకారం దేశం కోసం త్యాగం చేసిన దివ్యాంగులైన మాజీ సైనికులకు 300 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాల్సి ఉంది.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆయన పశ్చిమగోదావరి జిల్లా వాసి అని, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తి ఈ వాదనలను తప్పుబట్టారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి సేవలను దేశం మొత్తానికి అందించినట్లుగానే పరిగణించాలని, పునరావాస పథక ప్రయోజనాలను నిరాకరించడం సమర్థనీయం కాదని తేల్చి చెప్పారు. 2019 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయన పనిచేసిన లేదా నివసిస్తున్న ప్రాంతంలో ఎక్కడైనా పట్టా పొందడానికి అర్హుడని స్పష్టం చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
