హైదరాబాద్, వెలుగు: హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ నుంచి తొలగించిన175 మంది హార్టికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(హెచ్‌ఈవో)లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యానశాఖ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ అనుబంధశాఖల్లో అతితక్కువ వేతనాలతో సేవలను అందించిన హెచ్‌ఈవోలను కరోనా సమయంలో నిధులు లేవని తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ వస్తే తమ బతుకులు మారతాయని, ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఉద్యమించామని, కానీ ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే తమ కుటుంబాలను రోడ్డున పడేశారని వాపోయారు. గత 15 ఏండ్లుగా హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ, ఇప్పుడు 45 ఏండ్లకు పైబడి సర్కారు ఉద్యోగాలకు అర్హత కోల్పోయామన్నారు.
ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలను పోషించలేక, పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని ఆదుకోవాలని సంఘం ప్రతినిధులు కోరారు.
