
- యువతకు ఉపాధి కల్పనే మా లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి
- జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు పత్రాలు
- సింగరేణి కారుణ్య నియామకాల్లో వయో పరిమితి పెంపు
- ఉద్యోగ నియామక పత్రాలు అందించిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ కేవలం బొగ్గు గనిగా కాకుండా, వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్యోగాల గనిగా రూపొందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 13 దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించేందుకు కార్మికులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. శుక్రవారం ప్రజా భవన్‌లో సింగరేణి కారుణ్య నియామక పత్రాలను భట్టి అందించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ సింగరేణి కారుణ్య నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని 35 ఏండ్ల నుంచి 40 ఏండ్లకు పెంచడం ద్వారా వందలాది మంది వారసులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని భట్టి వెల్లడించారు.
కార్మిక సంఘాల దీర్ఘకాల విజ్ఞప్తిని మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వయోపరిమితి సడలింపు ద్వారా ఎంపికైన 21 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
సింగరేణి విస్తరణకు ప్రణాళికలు
పోటీ మార్కెట్‌లో సింగరేణి నిలదొక్కుకోవాలంటే, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, పూర్తి పనిగంటలు కృషి చేయాలని భట్టి కార్మికులకు సూచించారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి, ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఈ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే ప్రతి ఉద్యోగి శ్రమ శక్తిని చాటాలని కోరారు. సంస్థ అభివృద్ధిలో కింది స్థాయి కార్మికుడి నుంచి సీఎండీ వరకు అందరికీ సమాన బాధ్యత ఉందని, కఠిన నిబంధనలతో శ్రమతో కూడిన అడుగులు వేయాలన్నారు. ఉదాసీన వైఖరి భవిష్యత్తులో సంస్థకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని హెచ్చరించారు.
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారసులు తేలికపాటి ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని భట్టి సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.9 వేల కోట్లతో చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు జూన్ 2న, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పత్రాలు అందజేయనున్నట్లు భట్టి తెలిపారు. ఈ పథకంతో లక్షలాది మంది యువతకి ఉపాధి కల్పించనుందని వెల్లడించారు.
సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం: బలరామ్
సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ అన్నారు. వయోపరిమితి సడలింపు నిర్ణయంతో అనేక కుటుంబాల్లో వెలుగు నింపిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. గుర్తింపు కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, వయోపరిమితి పెంపును సంచలనాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం చైర్మన్ బి.జనక్ ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో ఏ బొగ్గు సంస్థలోనూ లేని విధంగా కారుణ్య నియామకాల వయోపరిమితిని 40 ఏండ్లకు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
కాంట్రాక్టు కార్మికులకు రూ.5 వేలు బోనస్ అందించడం, రానున్న రోజుల్లో ఆరు కొత్త గనులతో 20 వేల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని బలరాం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు, అధికారుల సంఘం అధ్యక్షులు లక్ష్మీపతి గౌడ్, జీఎం కవిత నాయుడు పాల్గొన్నారు.