న్యూఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో రానున్న వారాల్లో భారతీయ కుటుంబాలు వంటగ్యాస్ కొరతను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సరఫరా మార్గాల్లో అంతరాయం కలగడం వల్ల గత కొన్ని రోజుల్లో ధరలు 35 శాతం వరకు పెరిగాయి. భారత్ తన అవసరాలకు కావాల్సిన ఎల్పీజీలో 90 శాతం కంటే ఎక్కువ మిడిల్ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.
ఈ నెలలో రావాల్సిన గ్యాస్ సకాలంలో చేరకపోతే ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అమెరికా నుంచి ప్రత్యామ్నాయంగా దిగుమతి చేసుకోవాలన్నా సమస్యలు ఉంటాయి. రవాణా ఖర్చులు పెరగడంతో పాటు అవి భారత్ చేరుకోవడానికి ఏప్రిల్ వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం దేశంలో 30 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఎల్ఎన్జీ సరఫరా తగ్గడంతో పారిశ్రామిక వినియోగదారులకు సరఫరాలో కోత విధిస్తున్నారు. ముడి చమురు నిల్వలు ఎనిమిది వారాలకు సరిపడా ఉన్నప్పటికీ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే ఇబ్బందులు తప్పవు. రష్యా నుంచి వచ్చే చమురును వినియోగించుకోవడం లేదా ఇంధన ఎగుమతులను నిలిపివేయడం వంటి ప్రతిపాదలను కేంద్రం ప్రభుత్వం పరిశీలిస్తోంది.
