- ఇండియా నుంచి ఇరాన్ తిరిగి వెళ్తుండగా సబ్ మెరైన్ తో అటాక్
- ఐదోరోజూ దద్దరిల్లిన పశ్చిమాసియా ఇరాన్..
- ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకర దాడులు
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ!
- ఇజ్రాయెల్ దాడుల భయంతో ఖమేనీ అంత్యక్రియలు వాయిదా
- ఇరాన్లో1,045కు పెరిగిన మృతులు
టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా నుంచి స్వదేశానికి తిరిగి వెళ్తున్న ఇరాన్ అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఆర్ఐఎస్ దేనా’ను హిందూ మహాసముద్రంలో అమెరికా ముంచేసింది. సముద్రగర్భంలో సైలెంట్‌గా సబ్ మెరైన్ నుంచి టార్పెడోతో అటాక్ చేసి పేల్చేసింది. అమెరికా దాడి సమయంలో యుద్ధనౌకలో 180 మంది సిబ్బంది ఉండగా.. 87 మంది మృతిచెందారు. 32 మందిని శ్రీలంక నేవీ కాపాడగా, మరో 61 మంది గల్లంతయ్యారు. బుధవారం ఉదయం శ్రీలంకకు దక్షిణాన గాలే నగరం వద్ద తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలోని ఇంటర్నేషనల్ జలాల్లో ఈ దాడి ఘటన జరిగింది.
ఇరాన్ యుద్ధనౌకను తామే పేల్చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. దీనిని ఆయన 'క్వైట్ డెత్(నిశ్శబ్ద మరణం)’ అని అభివర్ణించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. అమెరికా ఒక శత్రు దేశపు నౌకను 'టార్పెడో' (నీటి అడుగున ప్రయోగించే మిసైల్)తో ముంచేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కాగా, ఇరాన్ నౌక పేలిపోయి, మునిగిపోతుండగా.. సబ్‌మెరైన్ పెరిస్కోప్ ద్వారా తీసిన బ్లాక్ అండ్ వైట్ వీడియోను అమెరికా విడుదల చేసింది. దూరంగా ఉన్న ఇరాన్ నౌక టార్పెడో తగలగానే భారీ పేలుడుతో ముక్కలై మునిగిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
దీనిపై అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ బ్రాడ్ కూపర్ మాట్లాడుతూ.. "మేం కేవలం యుద్ధం చేస్తలేం.. ఇరాన్ నేవీని మొత్తం ముంచేస్తున్నం" అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఇరాన్‌కు చెందిన 17 యుద్ధనౌకలను అమెరికా సముద్రంలో కలిపేసిందని ఆయన ప్రకటించారు.
గల్లంతైనవారు బతికే చాన్స్ లేదు..
శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ పార్లమెంటులో ఈ ఘటన వివరాలు వెల్లడించారు. ‘‘ఇరాన్ నౌక మునిగిపోతుందన్న సమాచారంతో శ్రీలంక నేవీ వెంటనే అక్కడికి చేరుకుంది. నేవీ వెళ్లేసరికే అక్కడ నౌక జాడ లేదు. సముద్రం మీద ఆయిల్ తెట్టు, అక్కడక్కడా లైఫ్ జాకెట్లు మాత్రమే కనిపించాయి. ఇప్పటిదాకా సముద్రం నుంచి 87 మృతదేహాలను వెలికితీశారు. మరో 32 మంది నావికులను ప్రాణాలతో రక్షించి గాలే పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు.
నౌకలో ఉన్న మిగతా 61 మంది ఏమయ్యారో తెలియడం లేదు. వారి కోసం నేవీ విమానాలు గాలిస్తున్నాయి” అని తెలిపారు. అయితే, సముద్రం లోతు ఎక్కువగా ఉండటం, పెను ప్రమాదం జరగడంతో మిగిలిన వాళ్లు బతికే అవకాశాలు తక్కువని శ్రీలంక నేవీ చెబుతోంది.
ఇండియా నుంచి తిరిగి వెళ్తుండగానే..
విశాఖపట్నం తీరంలో జరిగిన 'మిలాన్ 2026' నేవీ విన్యాసాల కోసమే ఇరాన్ యుద్ధనౌక 'ఐఆర్ఐఎస్ దేనా' ఇండియాకు వచ్చింది. ఫిబ్రవరి16న మొదలైన ఈ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొని బుధవారమే తిరిగి ఇరాన్ బయలుదేరింది. కానీ, మిలాన్-2026 యుద్ధ విన్యాసాల్లో పాల్గొని.. స్వదేశానికి తిరుగు ప్రయాణమైన ఈ యుద్ధనౌకకు చివరికి సముద్రమే సమాధి అయ్యింది. అంతర్జాతీయ జలాల్లో సేఫ్‌గా ఉన్నామనుకున్న ఇరాన్ నౌకను.. అమెరికా సబ్ మెరైన్ అటాక్ చేసి ముంచేసింది. అయితే, ఈ నౌక ఇండియాకు వచ్చేటప్పటి నుంచే అమెరికా సబ్ మెరైన్ దీనిని ట్రాక్ చేస్తూ ఉంటుందని డిఫెన్స్ నిపుణులు అనుమానిస్తున్నారు.
ఇరాన్ నౌక కనీసం అమెరికా సబ్ మెరైన్ ఉందన్న విషయాన్ని కూడా పసిగట్టలేకపోయిందంటే.. అమెరికా ఎంత సీక్రెట్ గా దీనిని ట్రాక్ చేసిందో అర్థమవుతోందని చెప్తున్నారు. కాగా, ఇది ఇరాన్ దగ్గరున్న అత్యాధునిక యుద్ధనౌక. ఇందులో భారీ గన్లు, గాలిలో విమానాలను కూల్చే మిసైళ్లు, హెలికాప్టర్ లాంటివి ఉన్నాయి. 2023లో బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో తిరుగుతూ ఇరాన్ తన పవర్‌ను ప్రపంచానికి చూపించుకుంది. ఉక్రెయిన్ మీద దాడి కోసం రష్యాకు డ్రోన్లు పంపిన కంపెనీతో ఈ నౌకకు సంబంధాలు ఉన్నాయని గతంలోనే అమెరికా దీనిపై ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు అదే నౌకను అమెరికా సముద్రం అడుగుకు పంపింది.
ఇరాన్ క్లస్టర్ బాంబులు.. చైనా, రష్యా పాత్ర?
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల మీదకు ఇరాన్ కూడా వరుసగా మిసైళ్లను ప్రయోగిస్తోంది. ఇరాన్ దాడితో బుధవారం జెరూసలేం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీల్లో ఒకటైన సౌదీ అరేబియాలోని 'రాస్ తనూరా' మీద బుధవారం ఇరాన్ మళ్లీ డ్రోన్లతో దాడికి దిగింది. ఇరాన్.. అనూహ్యంగా తన పొరుగు దేశమైన తుర్కియే మీదకు బాలిస్టిక్ మిసైల్‌ను వదిలింది.
అయితే, తుర్కియే గగనతలంలోకి రాకముందే తూర్పు మధ్యధరా సముద్రంపైన నాటో రక్షణ వ్యవస్థలు ఆ మిసైల్‌ను కూల్చివేశాయి. అయితే, యుద్ధంలో ఇరాన్ తాజాగా క్లస్టర్ బాంబులను ప్రయోగించడం సంచలనంగా మారింది. ఒక్క మిసైల్ గాలిలోకి వచ్చి పగిలితే.. దాని లోపలి నుంచి 80 చిన్న చిన్న బాంబులు బయటకు వచ్చి కిలోమీటర్ల మేర విధ్వంసం సృష్టిస్తున్నాయి. అయితే, ఇరాన్ ఈ క్లస్టర్ బాంబులు తయారు చేసుకోవడం వెనక రష్యా లేదా చైనా సాయం చేసి ఉండొచ్చని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది.
హార్మూజ్ తమ కంట్రోల్ లోనే ఉందన్న ఇరాన్..
షిప్పులకు తాము రక్షణ కల్పిస్తామన్న ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను శాసించే 'హార్మూజ్ జలసంధి' ఇప్పుడు యుద్ధానికి అడ్డాగా మారింది. ప్రపంచానికి కావాల్సిన ఆయిల్‌లో ఐదో వంతు (20%) ఈ సన్నని సముద్ర మార్గం నుంచే వెళ్తుంది. "ప్రస్తుతం ఈ హార్మూజ్ జలసంధి మొత్తం మా నేవీ గుప్పిట్లోనే ఉంది" అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారి మహమ్మద్ అక్బర్‌జాదే బుధవారం ప్రకటించారు.
ఇరాన్ బెదిరింపులతో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాత్రం తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఆయిల్ ట్యాంకర్లు నడిపే కంపెనీలు భయపడొద్దని, వాటికి తక్కువ ధరకే 'పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్' ఇస్తామని ప్రకటించారు. "అవసరమైతే అమెరికా యుద్ధ నౌకలే ముందుండి ఆయిల్ ట్యాంకర్లను నడిపిస్తాయి. ప్రపంచానికి ఆయిల్ సరఫరా ఆగనియ్యం" అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ఇరాన్ మరో వింత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తమకు సపోర్ట్‌గా ఉన్న చైనా నౌకలను మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతిస్తోందని సమాచారం. దీంతో దాదాపు 500కుపైగా భారీ నౌకలు గల్ఫ్ బయట ఒమన్, యూఏఈ తీరాల్లో లంగరు వేసి ఆగిపోయాయి. ఒక్క 'పోలా' అనే ట్యాంకర్ మాత్రం తన లొకేషన్ ట్రాకర్‌ను ఆపేసి.. దొంగచాటుగా హార్మూజ్ దాటి అబుదాబికి చేరుకుంది.
1,045కు పెరిగిన మృతులు
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందినవారి సంఖ్య బుధవారం నాటికి1,045కు పెరిగింది. ఇది ఇప్పటిదాకా వెలికితీసిన మృతదేహాల్లో గుర్తింపు పూర్తయిన వాటికి సంబంధించిన లెక్క మాత్రమేనని ఇరాన్‌కు చెందిన 'ఫౌండేషన్ ఆఫ్ మార్టైర్స్ అండ్ వెటరన్స్ అఫైర్స్' వెల్లడించింది. వీరందరికీ అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది.
కాగా, లెబనాన్ లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 50కిపైగా మంది చనిపోయారు. ఇక ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ లో 11 మంది, కువైట్ లో అమెరికా ఆర్మీకి చెందిన ఆరుగురు సోల్జర్లు మృతిచెందారు. ఓ షాపుపై డ్రోన్ శకలాలు పడటంతో 11 ఏండ్ల బాలిక కూడా మృతిచెందింది.
ఇరాన్‌పై ఇక థర్డ్ వేవ్ దాడులు
యుద్ధంలో ఇరాన్ ను ఇప్పటికే కోలుకోలేని దెబ్బ తీశాం. అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత ఇరాన్‌ను పరిపాలించే స్థాయిలో ఉన్న లీడర్లందరినీ అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు హతమారుస్తున్నాయి. ఇరాన్‌పై మా తొలి దాడిలోనే 49 మంది కీలక నాయకులు చనిపోయారు. బుధవారం కొత్త లీడర్లను ఎన్నుకోవడానికి ఇరాన్ పెద్దలు మీటింగ్ పెట్టుకుంటే.. ఆ మీటింగ్ జరుగుతున్న భవనం మీద కూడా మా బలగాలు బాంబులు వేశాయి. ఖమేనీ తర్వాత లీడర్లుగా ఎవరెవరు పగ్గాలు చేపట్టవచ్చని అనుకున్నామో.. వాళ్లందరినీ చంపేశాం. ఖమేనీ స్థానంలోకి ఇకపై వచ్చే కొత్త వాళ్లను కూడా వదలం. ఇరాన్‌పై ఇక త్వరలోనే థర్డ్ వేవ్ (మూడో దశ) దాడులు మొదలవుతాయి.
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్
