రండి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..ఎన్నారైలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు

రండి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..ఎన్నారైలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు
  • ఎన్నారైల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ
  • సింగిల్ విండో విధానంతో వెంటనే అనుమతులు ఇస్తామని వెల్లడి
  • ఆన్‌‌లైన్‌‌లో ఓటు హక్కునమోదు చేసుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్​, వెలుగు: దేశం దాటి వచ్చి ఉన్నత శిఖరాలు అధిరోహించిన ప్రవాస తెలంగాణ వాసులు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఎన్నారైల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా నిర్వహించిన 'ఆటా' 19వ జాతీయ మహాసభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

అనేక కష్టనష్టాలకోర్చి ఖండాంతరాలు దాటి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ప్రవాస భారతీయులు.. తాము సాధించిన విజ్ఞానాన్ని, మేధస్సును సొంత రాష్ట్రం, పుట్టిన గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో దీటుగా తెలంగాణ రాష్ట్రాన్ని పోటీపడే స్థాయికి తీసుకెళ్తున్నామని చెప్పారు. మీకోసం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేశామని, అన్ని అనుమతులు వెంటనే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పారిశ్రామికంగా, సామాజికంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని, మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి తనను ఇక్కడికి పంపించారని డిప్యూటీ సీఎం తెలిపారు.

ప్రత్యేక వ్యవస్థ రూపకల్పన..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), తెలంగాణలో ఉంటున్న వారి తల్లిదండ్రుల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధత (లీగల్ స్టేటస్) కలిగిన ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ ఆలోచనలో ఉందని భట్టి పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రవాసులు.. తమ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక వేదిక కావాలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రపంచంలో ఎక్కడ నివసించే తెలంగాణ వాసులైనా తమ ఇబ్బందులను, రాష్ట్రంలో నివసిస్తున్న తమ తల్లిదండ్రుల సమస్యలను ఈ ప్రత్యేక వ్యవస్థ దృష్టికి తీసుకొస్తే.. వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.

ఆన్‌‌లైన్‌‌లో ఓటు హక్కు నమోదు చేసుకోండి.. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతోందని ప్రవాసులకు డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. తెలంగాణ పౌరులు ప్రపంచంలో ఏ నలుమూలల ఉన్నా.. ఆన్‌‌లైన్ వెబ్‌‌ సైట్ ద్వారా తమ ఓటు హక్కును నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందన్నారు. ప్రవా సులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుని, తప్పనిసరిగా ఆన్‌‌లైన్ ద్వారా ఓటర్లుగా నమో దు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కుట్రలను ఛేదించి.. మణుగూరు బొగ్గు బ్లాక్​ సాధించాం

గత ప్రభుత్వం చేసిన కుట్రలను ఛేదించి మణుగూరు బొగ్గు బ్లాక్‌‌ను సింగరేణి సంస్థకు దక్కేలా చేశామని   డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమ వారం కేంద్రం నిర్వహించిన బొగ్గు వేలంలో ‘మ‌‌ణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్’ దక్కడం పట్ల ఆయన అమెరికా నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సింగరేణిని బొగ్గు వేలంలో పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం వల్లనే ఈ బొగ్గు బ్లాక్ దక్కిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే కొత్త బొగ్గు బ్లాక్ సింగరేణి వశమైందన్నారు.

గ‌‌త పాల‌‌కులు సింగ‌‌రేణి సంస్థను బొగ్గు వేలంలో పాల్గొన‌‌కుండా నిరోధించి రాష్ట్రంలోని విలువైన బొగ్గు బ్లాక్‌‌ల‌‌ను వారి అస్మదీయుల‌‌కు క‌‌ట్టబెట్టే కుట్రలు చేశార‌‌ని పేర్కొన్నారు. గ‌‌త నెల రోజుల వ్యవ‌‌ధిలో సింగ‌‌రేణిలో న‌‌మోదైన రెండో అతి పెద్ద విజ‌‌యంగా ఆయన పేర్కొన్నారు. డిప్ సైడ్ గ‌‌నితో 120 మిలియ‌‌న్ ట‌‌న్నుల నాణ్యమైన జీ-8 గ్రేడ్‌‌ బొగ్గును వెలికితీయొచ్చని, ఏటా 6 మిలియ‌‌న్ ట‌‌న్నుల చొప్పున 20 ఏళ్ల పాటు బొగ్గును రాష్ట్ర విద్యుత్ అవ‌‌స‌‌రాల‌‌కు వినియోగించుకోవ‌‌చ్చన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2 వేల మందికి పైగా కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి భద్రత లభించడమే కాకుండా, మణుగూరు ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి ప్రయోజనాల పరిరక్షణలో తగిన చొరవ చూపకపోవడం వల్ల కోయగూడెం-3 మరియు సత్తుపల్లి–3 వంటి కీలక బొగ్గు బ్లాక్‌‌లు ప్రైవేట్ సంస్థలకు వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు. తిరిగి వీటిని కూడా సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేయడం, కొత్త బొగ్గు నిల్వలను సంస్థకు అందించడం, ఉద్యోగ భద్రతను పెంపొందించడం, తెలంగాణ విద్యుత్ అవసరాలకు దీర్ఘకాలికంగా బొగ్గు సరఫరా భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని’ ఆయన ప్రకటించారు.