- జూన్ 2 నుంచి క్యాష్ లెస్ హెల్త్ స్కీమ్: డిప్యూటీ సీఎం భట్టి
- సీపీఎస్ నుంచి ఓపీఎస్ మార్పుపై చర్చల తర్వాత నిర్ణయం
- ప్రజా భవన్‌లో ఉద్యోగ సంఘాల లీడర్లతో భేటీ
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వంద రోజుల్లోనే పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రెండో పీఆర్‌సీ నివేదికను కమిటీ నుంచి తక్షణమే తెప్పించుకుని, ప్రతినిధులతో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను పీఆర్‌సీలో విలీనం చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా భవన్‌లో రెండు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో భట్టి వేర్వేరుగా సమావేశమయ్యారు. జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సుమారు 45 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల విడుదల, సీపీఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్లపై చర్చించారు. టీజీఈజేఏసీ ప్రతినిధులు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు 63 డిమాండ్లను డిప్యూటీ సీఎంకు వివరించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత (ఈహెచ్ఎస్) కార్డులను జూన్ 2 నుంచి అమల్లోకి తెచ్చేలా సీఎస్‌కు ఆదేశాలిస్తామని, సీపీఎస్ నుంచి ఓపీఎస్ మార్పుపై తదుపరి చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ఇప్పటికే కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని భట్టి తెలిపారు. పీఆర్‌సీ అమలు విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలని కోరారు. హెల్త్ కార్డులు, బదిలీలు, పదోన్నతుల వంటి అంశాలను కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి త్వరగా పూర్తి చేస్తామన్నారు.
తీపికబురు వస్తుందనుకుంటున్నం: లచ్చిరెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన చర్చల పట్ల ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 5న చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణపై జేఏసీ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. 2026 జూన్ నాటికి 45 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. జేఏసీ లీడర్లు శ్యామ్, దామోదర్ రెడ్డి, రామకృష్ణ, రాములు, బాణాల రాంరెడ్డి, రవి, రమేశ్, సదానంద్ గౌడ్, అనిల్ కుమార్, డాక్టర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
