
విద్యుత్ సరఫరాపై సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బిఆర్ఎస్ సోషల్ మీడియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్నిప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విద్యుత్ సరఫరా చేశామని చెప్పారు. రాబోయే వేసవిలో కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు.
ఫిబ్రవరి నుండి ఏప్రిల్ 2024 వరకు విద్యుత్తు డిమాండ్‌ను తీర్చడానికి తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు భట్టి విక్రమార్క. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు రాష్టాలతో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం 1200 మెగావాట్ల విద్యుత్తును ముందస్తుగా రిజర్వు చేసుకున్నామని చెప్పారు. ఆ రాష్ట్రాలలో విద్యుత్తు కొరత ఉన్నప్పుడు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు.
రాబోయే రోజుల్లో విద్యుత్తు సరఫరాలో ఏలాంటి అంతరాయం లేకుండా ముందస్తుగా మెయింటేనెన్స్ పనులు కూడ చేపట్టామన్నారు. నాణ్యమైన విద్యుత్తును కోతలు లేకుండా సరఫరా చేయాడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. విద్యుత్ సరఫరా విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2023 జనవరి కంటే 2024 జనవరిలో ఎక్కువగా విద్యుత్తు సరఫరా జరిగిందని ఇందుకు సంబంధించిన గ్రాఫ్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు భట్టి