- మా సర్కారు సామాజిక స్పృహతో
- పనిచేస్తున్నది : డిప్యూటీ సీఎం భట్టి
- రవీంద్ర భారతిలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
రవీంద్రభారతి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రజా ప్రభుత్వం సామాజిక స్పృహతో పాలన అందిస్తున్నదని.. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు, ఆలోచనలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో.. పూలే 199వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి డిప్యూటీ సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కులాల పునదులపై నిర్మించిన సమాజంలో పూలే లాంటి మహనీయులు కూడా వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వివక్షకు కుంగిపోకుండా భవిష్యత్ తరాలకు అలాంటి వివక్ష లేకుండా పునాదులు వేసిన మహనీయుడు అని కొనియాడారు. విద్య ద్వారానే సమాజం మారుతుందని భావించి, విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని.. పురుషులు, మహిళలు సమానం అనే భావనను తీసుకొచ్చారన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తుల పునరేకికరణ ప్రయత్నం జరుగుతున్నదని, బహుజనులు ఏకమై ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సామాజిక న్యాయం కోసం ప్రజా ప్రభుత్వం నిలబడి ఉంటుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో కులగణనను పరిగణనలోకి తీసుకోకపోతే యావత్ దేశంలోని బలహీనవర్గాలకు నష్టం జరుగుతుందని, మనకోసం మనం పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
పూలే జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి వాకిటి
పూలే జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. పూలే దంపతుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పూలే స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. జ్యోతిరావ్ పూలే జీవిత చరిత్రపై తీసిన సినిమాను ప్రతిఒక్కరూ చూడాలని కోరారు. ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎలాంటి స్వేచ్ఛ లేని బ్రిటిష్ పాలనలో అంటరానితనం నిర్మూలన కోసం పూలే కృషి చేశారని కొనియాడారు. స్త్రీ విద్య కోసం తన భార్యకు చదువునేర్పి మహిళలకు చదువు చెప్పించారని అన్నారు. అనంతరం అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మొమెంటోల విషయంలో పలువురి మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న నాయకులు వారించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ వి.హనుమంతరావు, వైస్ చైర్మన్లుగా విక్రమ్ గౌడ్, రాజేందర్, బీసీ సంఘ నాయకులు మేకపోతుల నరేందర్, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
