దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్..కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ముగింపు..

 దీక్ష విరమించిన  సోనమ్ వాంగ్‌చుక్..కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ముగింపు..

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల వివాదం, విద్యా వ్యవస్థ సంస్కరణల పోరాటంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్షను ఎట్టకేలకు విరమించారు.

గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో(జులై 23న అర్థారాత్రి) వాంగ్‌చుక్ తన దీక్షను ముగించారు. లేహ్ లడఖ్ ఆపెక్స్ బాడీ సీనియర్ నాయకులతో పాటు పలు రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది పార్లమెంట్ సభ్యుల విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వం చేసిన సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతోనే, అశాంతికి తావులేకుండా ఈ నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. శాంతి మాత్రమే నా మార్గం అని ఉద్ఘాటించిన ఆయన, నిరసనకారులు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని, శాంతియుతంగానే పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.

స్పందించిన మోదీ

ఈ పరిణామంపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వాంగ్‌చుక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు నీట్ పశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. పేపర్ లీకేజీ నిరోధానికి కఠిన చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు దిశగా చర్యలు చేపడతామని ప్రకటించింది.

వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ, కాకరోచ్ జనతా పార్టీ (CJP) సారథ్యంలో విద్యార్థులు చేపడుతున్న నిరసనలు జంతర్ మంతర్ వద్ద కొనసాగుతూనే ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి రాజీనామా , పూర్తిస్థాయి సంస్కరణలు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.