సీఎం షిండేను బెదిరించిన కేసులో నిందితుడు అరెస్ట్ 

సీఎం షిండేను బెదిరించిన కేసులో నిందితుడు అరెస్ట్ 

నాగ్ పూర్ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను బెదిరించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వచ్చిన అన్ని బెదిరింపులను తన నేతృత్వంలోని రాష్ట్ర హోం శాఖ గ్రహించిందని. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రత, ఇతర అంశాలపై పూర్తి శ్రద్ద వహిస్తున్నామని చెప్పారు. సీఎం షిండేను బెదిరించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని, ముఖ్యమంత్రికి మరింత భద్రత చాలా ముఖ్యమన్నారు. ముఖ్యమంత్రి షిండేను హోటల్‌లో చంపడానికి "ప్లాట్" అని పేర్కొంటూ పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసిన నిందితుడిపై పూణే పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న సమాచారం మేరకు అధికారులు ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్(SID)కు శనివారం సాయంత్రం ఈ విషయమై సమాచారం అందడంతో భద్రతను పెంచారు. ఇప్పటికే ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కలిగి ఉన్న సీఎం షిండేకు అదనపు భద్రత కల్పించినట్లు చెప్పారు. ముంబయిలోని షిండే అధికారిక నివాసం 'వర్షా'తో పాటు ఠాణెలోని వ్యక్తిగత నివాసం వద్ద కూడా సెక్యూరిటీ పెంచినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ కమిషనర్ అశుతోష్‌ డుంబ్రే తెలిపారు. 

ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు పదే పదే బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేయాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితుడిని కనిపెట్టేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ (సీపీ), ఇంటెలిజెన్స్ కమిషనర్ లను ఫడ్నవీస్ కోరారు. 

మరోవైపు ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని సీఎం షిండే అన్నారు. హోంశాఖ, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. మహారాష్ట్ర ప్రజల కోసం తన పని తాను చేసుకుంటూపోతానని, భద్రత విషయాన్ని అధికారులు చూసుకుంటారని పేర్కొన్నారు.