మందుకు నో లాక్ డౌన్.. బీరు రూ.300, ఫుల్ బాటిల్ 2000

మందుకు నో లాక్ డౌన్.. బీరు రూ.300, ఫుల్ బాటిల్ 2000

దేశమంతా లాక్ డౌన్‌ ఉన్నా మందుబాబులు మాత్రం పెగ్‌ డౌన్‌ చేయట్లేదు. వైన్స్ షాపులు బంద్ చేసినప్పటికీ ఉమ్మడి మెదక్, మహబూబ్​నగర్​, నల్గొండ జిల్లాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లాక్ డౌన్ ను ఏమాత్రం పట్టించుకోని వైన్స్ ఓనర్లు సరుకును బ్యాక్‌ డోర్‌‌ నుంచి బెల్ట్ షాప్ లకు చేరవేస్తున్నారు. కొందరైతే ఆబ్కారీ ఆఫీసర్లు షాప్‌లకు సీల్ వేయకముందే పెద్ద మొత్తంలో మద్యం నిల్వలను సీక్రెట్ ప్లేస్‌లో దాచి పెట్టారు. ప్రస్తుతం మందుకు ఫుల్‌ డిమాండ్‌ ఉండడంతో డబుల్‌, ట్రిపుల్‌ రేట్లకు అమ్మకుంటున్నారు. కొన్ని చోట్ల ఏకంగా డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. కల్లు కంపౌండ్‌లు బంద్‌ పెట్టడంతో తండాల్లో మళ్లీ సారా బట్టీలు పెడుతున్నారు. గత పదిరోజుల్లోనే ఎక్సైజ్‌ అధికారుల దాడుల్లో లక్షల రూపాయల మందు, గుడుంబా పట్టుబడ్డది.

డబుల్, ట్రిపుల్‌ రేట్లు

మద్యం బాటిళ్లను బెల్ట్‌ షాపు నిర్వాహకులు డబుల్‌, ట్రిపుల్‌ రేట్లకు అమ్ముతున్నా మందు బాబులు కొంటున్నారు. రూ.120 ఉన్న బీర్లను రూ. 300, రూ.700 ఉన్న విస్కీ ఫుల్‌ బాటిల్‌ రూ.1,800 నుంచి రూ. 2,000కు అమ్ముతున్నారు. పెద్దబ్రాండ్లు అయితే రూ.3000 వరకు పలుకుతున్నాయి. రూ. 100 ఉండే చీఫ్‌ లిక్కర్‌‌ను సైతం రూ.250కు అమ్ముతున్నారు. ఒక్కో వ్యాపారి వద్ద సుమారు రూ.20 లక్షల మద్యం నిల్వలున్నట్లు తెలుస్తోంది. మూడు ఉమ్మడి జిల్లాలో బ్లాక్‌‌మార్కెట్‌‌లో సుమారు రూ.6 కోట్లకుపైగా మద్యం నిల్వ చేసినట్లు సమాచారం.

సీల్ వేసినా.. 

ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించగానే  ఎక్సైజ్‌ ఆఫీసర్లు వైన్స్‌లను సీజ్‌ చేసి సీల్‌ వేశారు. వీళ్లు ముందు భాగంలోని షెటర్లకు సీల్‌ వేస్తే వ్యాపారులు బ్యాక్‌ డోర్‌‌ నుంచి పని మొదలు పెట్టారు. రాత్రి సమయంలో  కాటన్ల కొద్దీ మద్యాన్ని సీక్రెట్‌ ప్లేసులకు తరలిస్తున్నారు.  కొన్ని చోట్ల అయితే సీల్‌ తొలగించి.. మళ్లీ సీల్‌ వేస్తున్నారు.  మెదక్ జిల్లా టెక్మాల్‌లో ఓ  వైన్స్ షాప్ సీల్ ఓపెన్ చేసి మద్యాన్ని తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి.  సదరు వైన్స్ షాప్​కు అధికారులు మళ్లీ సీల్ వేయడం గమనార్హం. సిద్దిపేట జిల్లాలో కొందరు బ్రోకర్లను పెట్టుకుని చైన్‌‌ సిస్టమ్‌‌లో అమ్మకాలు సాగిస్తున్నారు. మరికొన్ని చోట్ల డోర్‌‌ డెలివరీ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

సరిహద్దుల్లో జోరుగా..

ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు అయిన సూర్యాపేట పట్టణం, కోదాడ, హుజూర్‌‌నగర్‌‌, అలంపూర్‌‌ నియోజకవర్గాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నారాయణపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన మక్తల్​, మాగనూర్​, ఊట్కూర్​, కృష్ణా, నారాయణపేట, దామరగిద్ద మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కర్నాటక నుండి మద్యాన్ని తీసుకు వచ్చి ఇక్కడి బెల్టుషాపులలో విక్రయిస్తున్నారు.