ముందస్తు అరెస్టులు చేసినా.. కేటీఆర్కు తప్పని నిరసన సెగ

ముందస్తు అరెస్టులు చేసినా.. కేటీఆర్కు తప్పని నిరసన సెగ

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తప్పలేదు. ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తల నుండి నిరసన సెగ తగలకుండా ముందస్తు అరెస్టులు చేసినా.. టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించే రీతిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. కూకట్ పల్లిలోని కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)కి మంత్రి కేటీఆర్ వచ్చే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలపై, దుకాణాలపై నిల్చుని నిరసన ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కేటీఆర్ వచ్చే మార్గంలో డివైడర్ పైన బ్యానర్లను కట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. కేజీ టు పీజీ, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు నెవేర్చలేదని.. అభివృద్ధి అంటే ఇదేనా...? అని ప్రశ్నిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.

భారీ ర్యాలీతో వచ్చి ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కార్యకర్తలు, అనుచరులతో కలసి భారీ ర్యాలీగా వచ్చిన మంత్రి కేటీఆర్ ఆర్వోబీని ప్రారంభించారు. సహచర మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు తదితరులతో కలసి కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. ఎస్ఆర్డీపీలో భాగంగా  రూ.86 కోట్లతో చేపట్టిన ఈ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి  రావడంతో హైటెక్ సిటీ నుంచి కూకట్ పల్లి  వరకు, అలాగే జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గిపోతున్నాయి. అలాగే సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కి.మీ ప్రయాణ దూరం తగ్గుతుందని అధికారులు తెలిపారు.ఫ్లై ఓవర్ ను ప్రారంభోత్సవం చేస్తున్న కారణంగా ఇయ్యాల ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.