ఇక అది ఎగరదు.. రెక్కలు తీసి, విమానంలో తరలించాల్సిందే!

ఇక అది ఎగరదు.. రెక్కలు తీసి, విమానంలో తరలించాల్సిందే!
  • టెక్నికల్ సమస్యతో కేరళలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన యూకే ఎఫ్ 35 ఫైటర్ జెట్ 
  • మూడు వారాలైనా కాని రిపేర్
  • మిలిటరీ ప్లేన్ లో తీస్కెళ్లేందుకు బ్రిటన్ సన్నాహాలు  

న్యూఢిల్లీ: గత నెల కేరళలోని తిరువనంతపురం ఎయిర్​పోర్ట్​లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక ఎఫ్-35బీ స్టెల్త్ ఫైటర్ జెట్ ను అతిపెద్ద సీ17 గ్లోబ్ మాస్టర్ విమానంలో ఆ దేశానికి తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్​13న జరిగిన ఇండో–యూకే నేవీ విన్యాసాల్లో బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ప్రముఖ విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి ఎఫ్-35బీ జెట్ భారత నౌకాదళంతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొంది. 

అయితే, ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత కారణంగా జెట్ తిరిగి విమాన వాహక నౌకకు చేరుకోలేకపోయింది. దీంతో జూన్ 14న రాత్రి పైలట్ తిరువనంతపురం ఎయిర్​పోర్ట్​లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ముందుగా ప్రతికూల వాతావరణం, ఇంధన కొరతతో దీన్ని ఎమర్జెన్సీ ల్యాండ్​ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఫైటర్ జెట్​లో ఇంజినీరింగ్ సమస్య ఉన్నట్టు తర్వాత తెలిసింది.  

దాని రిపేర్​కోసం బ్రిటిష్ రాయల్ నేవీ సాంకేతిక నిపుణులు, యూకేకు చెందిన 40 మంది ఇంజనీర్ల బృందం తిరువనంతపురం చేరుకుంది. గత 19 రోజులుగా వారంతా రిపేర్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. దీంతో యూకే అధికారులు ఈ జెట్ ను అతిపెద్ద సీ-17 గ్లోబ్​మాస్టర్ ట్రాన్స్​పోర్ట్​ ఎయిర్ క్రాఫ్ట్​లో తిరిగి యూకేకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఫైటర్ జెట్ భాగాలను విడదీసి అందులో బ్రిటన్​కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎఫ్-35బీ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్. 

ఈ యుద్ధ విమానానికి షార్ట్ టేకాఫ్ తో పాటు వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం ఉంది. అమెరికా సహా అతికొద్ది దేశాల సైన్యం వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. అమెరికాకు చెందిన లాఖీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఈ జెట్ ధర సుమారు 110 మిలియన్ డాలర్లు (సుమారు రూ.920 కోట్లు). ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్లలో ఒకటి.