ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలి: సీపీఎం

ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలి: సీపీఎం

బషీర్ బాగ్/ఎల్బీనగర్, వెలుగు: రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని కోరుతూ అబిడ్స్ లోని ఎస్ బీఐ ఆఫీస్ ​ముందు సీపీఎం నాయకులు ధర్నా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతిని కాపాడేందుకు బాండ్ల వివరాలు దాచిపెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్.వీరయ్య ఆరోపించారు. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్ బీఐ ధిక్కరిస్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్​బీఐ చైర్మన్ జూన్ వరకు సమయం ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వాన్ని కాపాడేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం తుర్కయాంజల్​ ఎస్ బీఐ బ్రాంచ్​ ముందు ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. బాండ్ల వివరాలు బయట పెట్టాలని కోరారు.