- భీమన్న, రాజన్న ఆలయాల్లో మొక్కులు
- 24 గంటలు దర్శనం కల్పించిన అధికారులు
వేములవాడ, వెలుగు: సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల జాతర షురూ కావడంతో వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయాలైన శ్రీ భీమేశ్వర ఆలయం, శ్రీ బద్ది పోచమ్మ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల పాటు దర్శనానికి తెరిచి ఉంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
జాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను, స్వామివారిని దర్శించుకున్నారు. భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
రాజన్న ఆలయ ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రచార రథంలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. రాత్రి వరకు 65 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈఓలు జి. శ్రావణ్ కుమార్, జి. అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, విజయ్ కుమార్, వెల్ది సంతోష్, సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ సాయి కుమార్ ఓన్నారం భాస్కర్, పురాణం వంశీ శర్మ ఉన్నారు.
