మానవ జీవితం సక్రమంగా నడవటానికి కావలసిన ముఖ్య విషయాలను, ఆచరించవలసిన కర్తవ్యాలను మహర్షులు చక్కగా వివరించారు. మానవ ప్రగతికి సోపానాలు వేసే సూక్తులు బోధించారు. వ్యక్తి ఉన్నతికి అనుసరించవలసిన ధర్మాలు చెప్పారు. విషయాలను చెప్పటంవరకే వారి కర్తవ్యం. ఆచరించటం, ఆచరించకపోవటం... వారి వారి విచక్షణకి, విజ్ఞతకి వదిలేశారు ఆ మహానుభావులు. సదాచరణ వల్ల కలిగే సత్ఫలితాలను తెలియజేశారు. దుష్ట ప్రవర్తన వల్ల కలిగే దుష్పలితాలను కూడా వివరించారు.
ఆత్మస్తుతి పనికిరాదు
మనిషి పతనానికి అనేక కారణాలుంటాయి. . అందులో ఆత్మస్తుతి, పరనింద... రెండూ ప్రమాదమే. ముందుగా ఆత్మస్తుతి వల్ల కలిగే నష్టాల గురించి చూద్దాం. ప్రతి మనిషికీ తానే చాలా గొప్పవాడినని, తనను మించిన వారు లేరని, తానే చాలా అందంగా ఉంటానని, తాను చేసిందే సరైనదనీ, తాను లేకపోతే పనులన్నీ ఆగిపోతాయనే అహంకారంతో కూడిన ఆలోచన ఉంటుంది. ఇందుకు ఒక చిన్న కథ ఉదాహరణగా చెప్పుకోవాలి.
ఒక ముసలవ్వ దగ్గర ఒక కోడి, ఒక కుంపటి ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఆ కోడి కొక్కొరోకో అని కూసేది. ఆ కోడి కూయనిదే ఊరివారెవరూ నిద్రలేవరనే భావన ముసలి అవ్వలో పాతుకుపోయింది. అలాగే ప్రతిరోజూ కుంపటి వెలిగించి, ఊరివారందరికీ నిప్పు ఇస్తుండేది. అందరూ తన దగ్గరకు వస్తుండటం వల్ల తాను కుంపటి వెలిగించి, నిప్పు ఇవ్వనిదే ఆ గ్రామంలో ఎవరింట్లోనూ పొయ్యి వెలగదన విర్రవీగిపోయేది. అదే మాట అందరితోనూ కించిత్తు గర్వంతో చెప్పేది. ముసలి అవ్వే కదా అని ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు.
ఒకరోజు అనుకోకుండా కోడి కూయలేదు. కాని ఆ గ్రామ ప్రజలంతా తెల్లవారుజామునే నిద్ర లేచారు. ముసలి అవ్వకు తల మీద నుంచి కాళ్ల వరకు గర్వం దిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అవ్వ జబ్బున పడటంతో కుంపటి వెలిగించలేకపోయింది. కాని అందరి ఇళ్లలోనూ పొయ్యిలు వెలిగాయి. ఎప్పట్లానే ఊళ్లో అంతా వంటలు చేసుకున్నారు.
అవ్వలో ఉన్న మిగిలిన గర్వం కాళ్ల నుంచి నేల మీదకు దిగిపోయింది. తన కోడి లేవలేదు. తను కుంపటి ముట్టించలేదు.. అయినా అందరి పనులుయదావిధిగా జరిగిపోయాయి. తన వల్లే ఇంత జరుగుతోందని ఇన్ని రోజులూ అనుకున్న అవ్వ.... ఎవరున్నా లేకపోయినా పనులన్నీ వాటంతట అవి జరిగిపోతాయని ఆ రోజు తెలుసుకుంది. ఆత్మస్తుతి వల్ల ఉపయోగం లేదని అర్థం చేసుకుంది. తమను తాము పొగుడుకోవటం వల్ల సాధించేదేమీ లేదని ఈ కథ మనకు చెప్తుంది..
ఆత్మస్తుతి... మానవ వినాశనానికి దారి తీస్తుందని మహాభారతంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి హితబోధ చేశాడు. పాండవులు మాయా జూదంలో ఓడిపోయిన తరువాత, ద్రౌపదిని అంతఃపురం నుంచి కొప్పు పట్టి ఈడ్చి, నిండుసభలో వస్త్రాపహరణం చేసి దుర్మార్గంగా ప్రవర్తించాక కూడా, తను తప్పు చేయలేదనీ, ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్నానని, తనను మించిన ధర్మపరుడు లేడనీ, తాను చేసిన పనిలో దోషం లేదనీ.. ఇలా పలువిధాలుగా తనను తాను స్తుతించుకున్నాడు. తనను తాను సమర్ధించుకున్నాడు దుర్యోధనుడు. అన్నీ తెలిసిన భీష్మ, ద్రోణులు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వారి మాటను పెడచెవిన పెట్టి తానెంత గొప్పవాడో చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చాడు.
పాండవులు తల వంచుకుని అరణ్య, అజ్ఞాత వాసాలు ముగించుకుని వెనుకకు తిరిగివచ్చి, ఒప్పందం ప్రకారం తమ రాజ్యం తమకు ఇవ్వమని అడిగారు. అందుకు సమాధానంగా దుర్యోధనుడు... సూది మొన మోపేంత స్థలం కూడ ఇవ్వనని, అలా ప్రవర్తించటమే సక్రమమని తనను
తాను ప్రశంసించుకున్నాడు.
రామాయణంలో రావణుడు కూడా అదే పని చేశాడు. తన రాజ్యంలోని ప్రజలందరికీ సకల సౌకర్యాలు కల్పించానని తనంతటి ప్రజాస్వామ్యవాది ఉండడని ఆత్మస్తుతి చేసుకున్నాడు. రాముడిలాంటి ఉన్నతమైన వ్యక్తిని పలురకాలుగా నిందించాడు. నరసింహావతారంలో హిరణ్యకశిపుడు కూడా ఆత్మస్తుతి చేసుకున్నాడు. శ్రీకృష్ణుడిని సత్కరించే సమయంలో శిశుపాలుడు.. ఈ సభలో తన వంటి ప్రముఖులుందగా శ్రీకృష్ణుని వంటి గోపబాలుడిని గౌరవించటమేమిటని నిందించాడు.
మన పురాణాలు, చరిత్ర పరిశీలించి చూస్తే ఆత్మస్తుతి చేసుకున్నవారంతా, వారి జీవిత సంధ్య అస్తమించే సమయంలో దుర్బరమైన జీవితం గడిపినట్లు తెలుస్తుంది. నాటి గ్రీకువీరుడు అలెగ్జాండర్, నెపోలియన్, హిట్లర్ దగ్గర నుంచి, సద్దాం హుస్సేన్ దాకా అందరూ ఆత్మస్తుతి చేసుకుని, మితిమీరిన అహంకారంతో స్వయంగా పతనాన్ని కోరి తెచ్చుకున్నవారే.
ఇటువంటి వారి జీవితాలను ఉదాహరణలుగా తీసుకుని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నా అంతటి వాడు లేడంటూ విర్రవీగకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక పని చేసేటప్పుడు ఆ పని చేయిస్తున్నది విధాత అని అర్ధం చేసుకుని, ఆత్మ విమర్శ చేసుకునే లక్షణం అలవరచుకుంటే... మనిషి అభివృద్ధి బాటలోకి దూసుకుపోతాడని పండితులు, పౌరాణికులు బోధిస్తున్నారు..
